కొల్లూరులో హ్యుందాయ్‌ మొబీస్‌

21 Sep, 2018 02:41 IST|Sakshi

ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌ క్యాంపస్‌ ఏర్పాటు

మంత్రి కేటీఆర్‌ హర్షం

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ బహుళజాతి ఆటోమొబైల్‌ కంపెనీ ‘హ్యుందాయ్‌ మొబీస్‌’హైదరాబాద్‌ శివారులోని కొల్లూరులో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్, రీసెర్చ్, డెవలప్‌మెంట్, ఐటీ, ఐటీ అనుబంధ కార్యకలాపాల కోసం కొల్లూరు ఐటీ క్లస్టర్‌ పరిధిలోని 20 ఎకరాల్లో క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన కంపెనీ ప్రతినిధి బృందం.. చివరకు కొల్లూరును కార్యకలాపాల కోసం ఎంపిక చేసుకుంది.

ఈ మేరకు కొల్లూరులో 20 ఎకరాలను కంపెనీకి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) కేటాయించింది. క్యాంపస్‌ ద్వారా 2,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. పరోక్షంగా కొన్ని వేల మంది ఉపాధి పొందనున్నారు. 2020 నాటికి క్యాంపస్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో క్యాంపస్‌ ఏర్పాటుకు హ్యుందాయ్‌ మొబీస్‌ ముందుకు రావడం పట్ల పరిశ్రమల శాఖ ఆపద్ధర్మ మంత్రి తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు.

క్యాంపస్‌ ఏర్పాటుతో కొల్లూరులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మొబిలిటీ క్లస్టర్‌కు బలం పెరుగుతుందన్నారు. హైదరాబాద్‌లో ఆటోమోటివ్, స్మార్ట్‌ మొబిలిటీ పరిశ్రమల విస్తరణకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. భారీ పెట్టుబడులతో ముందుకొచ్చిన ççహ్యుందాయ్‌ మొబీస్‌ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీకి అవసరమైన పూర్తి సహాయ సహకారాలందిస్తామని కేటీఆర్‌ చెప్పారు. çహ్యుందాయ్‌ మొబీస్‌ పరిశ్రమ ద్వారా కొల్లూరులోని ఆటోమోటివ్‌ మొబిలిటీ క్లస్టర్‌కు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు.

మరిన్ని వార్తలు