ఎవరితోనూ సహజీవనం చేయడం లేదు: డీఎస్‌ కుమారుడు

3 Aug, 2018 11:28 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) కుమారుడు సంజయ్‌ స్పందించారు. 'నాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవు. శాంకరి నర్సింగ్‌ కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాము. అక్కడికి నేను వెళ్ళలేదు. అడ్మిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కాలేజీలో ఎవరు చదువుతున్నారో కూడా తెలియదు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఎవరితో సహజీవనం చేయడం లేదు. ఎవరో విద్యార్థినులతో అలా చెప్పించారు. రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇవన్నీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరో తెలియదు కానీ మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఇలాంటివి జరుగుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు' అని ధర్మపురి  సంజయ్‌ పేర్కొన్నారు.

కాగా, డీఎస్‌ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా తమను సంజయ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్‌ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్‌ చేయాలనీ, శాంకరి నర్సింగ్‌ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు.

మరిన్ని వార్తలు