నాపై టీఆర్ఎస్ ఆశలు వదులుకోవాల్సిందే

8 Aug, 2014 13:15 IST|Sakshi
నాపై టీఆర్ఎస్ ఆశలు వదులుకోవాల్సిందే

హైదరాబాద్ : తన విషయంలో టీఆర్ఎస్ ఆశలు వదులుకోవాల్సిందేనని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ తాను టీఆర్ఎస్లో చేరటం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తనకు పదవులపై ఆశ లేదని అన్నారు. గతంలో కూడా టీడీపీలోకి వెళ్లి ఇమడలేకే....మళ్లీ కాంగ్రెస్లోకే వచ్చానని దానం తెలిపారు. ప్రభుత్వం తనను ఇబ్బంది పెడితే...తాను కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడతానని ఆయన వ్యాఖ్యానించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం ...కాంగ్రెస్తో కలిసి వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేమని దానం అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం పనిచేయదని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలే కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని దానం వ్యాఖ్యలు చేశారు. ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉంటుందన్నారు. కాగా ఈనెల 19న ఇంటింటికి సమగ్ర సర్వేలో ఆటో డ్రైవర్లు, కూలీల పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని దానం డిమాండ్ చేశారు. ఇళ్లలో ఉండాలంటే వారికి ఆ మేరకు ప్రభుత్వం భత్యం ఇవ్వాలని అన్నారు. పొన్నాల లక్ష్మయ్యపై వ్యక్తిగత విమర్శలు తగవని దానం హితవు పలికారు.

 

మరిన్ని వార్తలు