పది పరీక్షల విధానం పూర్తిగా రద్దు చేయాలి: విష్ణు

29 Jun, 2020 16:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించే విధానం పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. 14,15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి?’ అంటూ మంచు విష్ణు ట్విటర్‌లో ప్రశ్నించారు. 

ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక పలువురు నెటిజన్లు విష్ణు అభి​ప్రాయంతో ఏకీభవిస్తున్నారు. గతంలో 7వ తరగతి విద్యార్థులకు కూడా బోర్డు పరీక్షలు ఉండేవని ఆ తర్వాత తీసేశారని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. ‘విద్యాభ్యాసానికి మ‌న ప‌రీక్షల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ ఒక‌ శాపం లాంటిది’ అని జాకీర్ హుస్సేన్ క‌మిటీ 1939 లోనే వ్యాఖ్యానించిన విషయాన్ని మరో నెటిజన్‌ గుర్తుచేశాడు. ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేశాయి. అంతేకాకుండా సీబీఎస్‌ఈ పరిధిలోని 10,12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్‌ ఇస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. 

మరిన్ని వార్తలు