మీ ఆశీర్వచనం గావాలె

18 Mar, 2019 15:46 IST|Sakshi
మంత్రి ఈటల, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లతో ముచ్చటిస్తున్న సీఎం కేసీఆర్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడంతో తనకు కలిసొచ్చిన కరీంనగర్‌ గడ్డ ఖ్యాతిని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మరోసారి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్‌ఎస్‌ ఉద్యమ వేదికను ప్రకటించినప్పుడు కరీంనగర్‌ పోరాటాల గడ్డ సద్ది గట్టి పంపిందని తెలిపారు. అదే కరీంనగర్‌ నుంచే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశానికి సంబంధించి ప్రకటన చేస్తున్నట్లు అశేష జనవాహని ఆమోదం మధ్య కేసీఆర్‌ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తొలి ప్రచార బహిరంగ సభను కరీంనగర్‌లో ఆదివారం ఏర్పాటుచేయగా.. సీఎం కేసీఆర్‌ ఉద్విగ్నభరితమైన ప్రసంగం చేశారు.

ఇందుకోసం గెలిపించాలి...

కాంగ్రెస్, బీజేపీల తీరుపై గతంలో ఎన్నడూ లేని రీతిలో ధ్వజమెత్తిన కేసీఆర్‌... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన సహజమైన రీతిలో చురకలటించారు. రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్‌ 16 లోక్‌సభ సీట్లను గెలుచుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఆ సీట్లు అవసరమని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీని స్థాపించి, దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు.

18 సంవత్సరాల క్రితం టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తరువాత 2001 మే 17న  ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో జరిగిన  సభలో తెలంగాణ తెస్తనని విస్పష్టంగా ప్రకటించిన కేసీఆర్‌ 2014లో తన కలను సాకారం చేసుకున్నారు. నాటి భారీ బహిరంగసభ పార్టీ బలాన్ని పెంచి రాష్ట్ర, దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేయగా, ఆదివారం నాటి కరీంనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభ దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ పాత్రను మరో సారి జాతి దృష్టిని ఆకర్షించింది.

 కరీంనగర్‌ ప్రజల ఆశీర్వచనం కోసమే..

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సభను కరీంనగర్‌లో ఏర్పాటు చేసింది జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఈ గడ్డ ప్రజల ఆశీర్వచనం తీసుకునేందుకేనని కేసీఆర్‌ ప్రకటించారు. దేశ రాజకీయాల్లోకి తనను వెళ్లమంటారా అంటూ ఒకటికి, రెండు సార్లు ప్రశ్నించిన కేసీఆర్‌ వారి సంఘీభావం తెలిపేందుకు చేతులెత్తాలని కోరారు. దీంతో ప్రజలంతా లేచి నిలబడి ‘పీఎం కేసీఆర్‌... దేశ్‌ కీ నేత కేసీఆర్‌’ అని నినాదాలు చేస్తూ తమ మద్దతు ప్రకటించారు. సభకు హాజరైన ప్రజలతో పాటు వేదికపై కూర్చొన్న ప్రతీ నాయకుడు లేచి చప్పట్లు కొడుతూ కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతించడం విశేషం.

వినోద్‌ను మంత్రిని చేస్తా..

తెలంగాణ ఉద్యమంలో తన వెన్నంటి ఉన్న వినోద్‌కుమార్‌ను కరీంనగర్‌ ఎంపీగా మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్‌ కోరారు. ఆయన గెలిచి, కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే కేంద్రమంత్రి అవుతారని స్పష్టం చేశారు. కరీంనగర్‌ ప్రజలు ఎప్పుడూ తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. 

లక్షన్నరకు పైగా జనం

కరీంనగర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌లో జరిగిన సీఎం ఎన్నికల ప్రచార  సభకు లక్షన్నరకు పైగా జనం తరలివచ్చారు. దీంతో కరీంనగర్‌ రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. మానేర్‌డ్యాం కింద ఈ మైదానం ఉండడంతో సిరిసిల్ల, వేములవాడ, హుజురాబాద్, మానకొండూరు నుంచి వాహనా ల్లో వచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు నేరుగా బ్రిడ్జి పై నుంచే మానేర్‌ డ్యాంకు వచ్చి నిలిపారు. ఈ మేర కు చాలా మంది డ్యాం కట్ట పైనుంచే జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షించారు. సీఎంతో పాటు పలు వురు నేతలు డ్యాం పైనున్న వారిని కిందికి రమ్మని కోరినా రాలేదు. సభలో ఉన్నంత జనం కట్ట మీదున్నారని సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఎన్నికల కోడ్‌తో అలంకరణకు బ్రేక్‌

కరీంనగర్‌లో సీఎం రాక సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పలు కూడళ్లలో గులాబీ తోరణాలు కట్టించారు. ఎక్కడా టీఆర్‌ఎస్, కారు గుర్తులు లేకపోయినా ఎన్నికల నిబంధనల మేరకు మునిసిపల్‌ సిబ్బంది వాటిని తొలగించారు. సాయంత్రం సభ అయిపోగానే తీసివేస్తామని ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు కోరినా మునిసిపల్‌ సిబ్బంది వినలేదు.   

మరిన్ని వార్తలు