4 ఏళ్లు కేసీఆర్‌పై విమర్శలు చేయను : జగ్గారెడ్డి

12 Dec, 2018 18:44 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి :  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్, జిల్లా మంత్రి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా 4 సంవత్సరాల వరకు ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఎలాంటి రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయనని జగ్గారెడ్డి పేర్కొన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటింటికి మంజీర నీటి సరఫరా, విద్యా సంస్థల ఏర్పాటు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం అడుగుతానని తెలిపారు. సమస్యలను ఉత్తరాల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వం తన ప్రతిపాదనలు తిరస్కరిస్తే.. సభలు ఏర్పాటు చేసి.. ప్రజలకు వివరిస్తానని చెప్పారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారనని, కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలు తన నియోజకవర్గంలో ఉండవని తెలిపారు. ఊహ తెలుసినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నానని, 2014లో సెంటిమెంట్ వల్ల ఓడిపోయానన్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పని చేస్తానని తెలిపారు.

చింత ప్రభాకర్ తనను రాజకీయంగా అనగదొక్కాలనే ప్రయత్నం చేసి విఫలమయ్యాడని జగ్గారెడ్డి అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే.. కేసీఆర్ ను సైతం అభినందిస్తానన్నారు. ప్రస్తుత పురపాలక సంఘాల కాలపరిమితి ముగిసే వరకు.. కార్యాలయాలకు వెళ్లనని చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్నీ మతాల వారు తనకు ఓటు వేసి గెలిపించారని, 17న సంగారెడ్డి నియోజకవర్గంలోని లక్ష మందితో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నానని తెలిపారు.

మరిన్ని వార్తలు