మంత్రిలా కాదు.. కార్మికునిలా పనిచేస్తా

9 Sep, 2014 23:56 IST|Sakshi
మంత్రిలా కాదు.. కార్మికునిలా పనిచేస్తా

 మెదక్‌టౌన్: తాను మంత్రిలా కాకుండా కార్మికునిలా పనిచేస్తానని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి, తెలంగాణ మజ్దూర్ యూనియన్(ఆర్టీసీ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు టి.హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్స్‌లో టీఎంయూ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్న తీరు చరిత్రపుటల్లో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతాయన్నారు. కార్మికుల హక్కులను కాపాడుతూ, ఆర్టీసీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఆర్టీసీ విభజన జరిగాక, కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం తక్షణ సాయం కింద ఆర్టీసీకి రూ.250 కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం నిబద్ధతో పనిచేసిన ఆర్టీసీ కార్మికుల రుణం తీర్చుకుంటామన్నారు.

 ఈనెల 13న జరిగే ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు. అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి అభినందనీయమని, పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, 3 నెలల పాలనలో ఆర్టీసీ కార్మికులకు టీఆర్‌ఎస్ సర్కార్ ఎంతో చేసిందన్నారు.

కొత్త డిపోల ఏర్పాటు, కార్మికుల సంక్షేమం, కొత్త బస్సుల కొనుగోలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర అధ్యక్షులు థామస్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎం.ఆర్.కె.రావు, మారయ్య, కె.ఎన్.రెడ్డి, జోనల్ కార్యదర్శులు ఆర్.ఎస్.రెడ్డి, శాఖయ్య, మెదక్ డిపో అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వీరాజ్, ఆరీఫ్, శంకర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు