నన్ను ఓడించిన హరీష్‌ శిక్ష అనుభవిస్తున్నాడు

20 Jul, 2019 10:51 IST|Sakshi
సన్మానసభలో మాట్లాడుతున్న ఎంపీ రేవంత్‌రెడ్డి

మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి

కోస్గి (కొడంగల్‌): సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ఢిలీల్లో పోరాడతానని, నియోజకవర్గంలో పదేళ్ల కాలంలో రేవంత్‌రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గాని, ప్రస్తుత ఎమ్మెల్యే గాని చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని మల్కాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డికి శుక్రవారం కోస్గిలో పార్టీ నాయకులు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌ మాట్లాడుతూ.. ప్రశ్నించే వాడు లేకుంటే పాలించే వాడిదే రాజ్యమవుతుందని గుర్తించిన రాష్ట్ర ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని, ఢిల్లీలో ఉన్న కొడంగల్‌ ప్రజల ఆదరణ, అభిమానాన్ని ఎన్నడూ మర్చిపోనన్నారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలని, మున్సిపాలిటీలకు నిధులు కేంద్రమే ఇస్తుందని, కేంద్రంలో పోరాడి నిధులు తెచ్చే బాధ్యత నాదేనన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్‌ పంపిన హరీష్‌రావు గతి ఇప్పుడేమైందో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. పొట్టోన్ని పొడుగొడు కొడితే.. పొడుగొన్ని పోశమ్మ కొట్టిందన్నట్టు హరీష్‌రావు కొడంగల్‌ ప్రజలకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తున్నారన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు.  అంతముందు రేవంత్‌రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ ఆలయంలో, కోస్గి శివారులోని సయ్యద్‌ పహాడ్‌ దర్గాలో పూజలు చేసి రామాలయం, శివాజీ చౌరస్తా మీదుగా రోడ్‌షో నిర్వహిస్తూ లక్ష్మీనర్సింహా గార్డెన్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో తిరుపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కుమార్, రఘువర్దన్‌రెడ్డి, నరేందర్, రాఘవరెడ్డి, భీంరెడ్డి, బెజ్జు రాములు, గోవర్దన్‌రెడ్డి, ఆసీఫ్, విక్రంరెడ్డి, ఇద్రీస్, సురేష్‌రెడ్డి, అచ్యుతారెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు