హోంమంత్రి అమిషాను కలుస్తా : భట్టి

19 Aug, 2019 07:38 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ అక్రమాలను వివరిస్తా

టీఆర్‌ఎస్‌ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌: భట్టి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ చేస్తోన్న అక్రమాలపై త్వరలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలసి వివరిస్తానని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ)నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న స్కీములన్నీ స్కాములేనని కాంగ్రెస్‌ ఆరేళ్లుగా చెబుతూనే ఉందన్నారు. అప్పుడు పట్టీపట్టనట్టు వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌ ఆరోపణల్నే వల్లె వేస్తోందన్నారు. కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌ తోకపార్టీ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలపై భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి పార్లమెంట్‌లో మొదటినుంచి టీఆర్‌ఎస్‌ సహకరిస్తుండటం వాస్తవం కాదా అని ప్రశ్నిం చారు. ఒకరికొకరు సహకరించుకుంటున్న కారణంగానే టీఆర్‌ఎస్‌ చేస్తోన్న అక్రమాలను బీజేపీ పట్టించుకోవడం లేదని, అలాగే టీఆర్‌ఎస్‌ కూడా బీజేపీ ప్రభుత్వం చేసిన అన్ని పనులకు మద్దతిచ్చిందని గుర్తుచేశారు. 

స్కీములన్నీ స్కాములే 
కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, సీతారామ ప్రాజెక్ట్, పాలమూరు–రంగారెడ్డి సహా రీ డిజైనింగ్‌ ప్రాజెక్టులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిం చాలని భట్టి డిమాండ్‌ చేశారు. రీ డిజైనింగ్‌ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద స్కామన్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి పంప్‌చేసిన నీటికంటే ఎక్కువ జలాలను కిందికి వదిలేశారని, దీనివల్ల ఖజానాకు లాభమో, నష్టమో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రూ. లక్షకోట్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక సూత్రధారుని ద్వారా టెండర్లు వేసి పనులు చేయించారని ఆరోపించారు. రూ. 55 వేల కోట్ల మిçషన్‌ భగీరథ టెండర్లు కూడా అలాగే జరిగాయని తెలిపారు. రాష్ట్ర నిధులను ఒక కుటుంబం దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ప్రతీ టెండర్లో ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 లే పాల్గొన్నాయని, వాటికే పనులు దక్కాయని చెప్పారు. వీటి మీద విచారణ జరిపించేలా కేంద్రంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒత్తిడి తెచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. ఏ పార్టీలో, ఎక్కడా అవకాశం లేని నాయకులనే బీజేపీ చేర్చుకుంటోందని, క్షేత్రస్థాయిలో పట్టులేకనే ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటోందన్నారు.
 

మరిన్ని వార్తలు