ఆ విషయంలో కేసీఆర్‌ను సమర్థిస్తా: జగ్గారెడ్డి

19 Jun, 2019 16:42 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెప్తున్నట్లు కాళేశ్వరం నిర్మాణాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని, మంచి పని ఎవరు చేసినా సమర్థిచాలని ఆ పార్టీ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 21న ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ, నిర్మాణ వ్యయం భారీగా పెంచారని ఇటీవల కాంగ్రెస్‌ నాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం విలేకర్లతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం పూర్తి అయితే నా నియోజకవర్గంలోని సింగూరు, మంజీరకు నీళ్ళు వస్తాయి. మా సంగారెడ్డికి ఉపయోగపడే అత్యంత పురాతన మహబూబ్‌ సాగర్‌కు నీళ్ళు వస్తాయి. వీటి ద్వారా మా ప్రజల సాగు, త్రాగు నీటి సమస్య తీరుతుంది. రైతులు, ప్రజల కోసం ప్రాజెక్టు, డ్యాంలు ఎవరు కట్టినా మంచిదే. తెలంగాణ తొలి డ్యాం నాగార్జునసాగర్, శ్రీశైలంలతోపాటు సింగూరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. నాడు కాంగ్రెస్ సీఎంలు కట్టినా, నేడు కేసీఆర్ కట్టినా అన్నీ తెలంగాణ ప్రజల కోసమేనని భావించాల’’న్నారు. 

ఇక రాజకీయ విమర్శలపై స్పందిస్తూ.. ‘‘ఇలాంటి వాటిని రాజకీయం చేయొద్దు. ఒకరకంగా సోనియా, రాహుల్ గాంధీలు తెలంగాణ ఏర్పాటు చేయటం వల్లే కేసీఆర్ సీఎం అయ్యి కాళేశ్వరం కడుతున్నాడు. ఆ రకంగా అందులో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉంది. కాళేశ్వరం ప్రారంభమైన ఏడాదిలో సింగూరు, మంజీర, మహబూబ్‌సాగర్‌లను నీళ్ళతో నింపితే మా సంగారెడ్డి రైతులు, ప్రజల పక్షాన కేసీఆర్ గారికి ఘనంగా సన్మానం చేస్తామ’’ని ప్రకటించారు. అవినీతి అంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలపై అడిగితే వాటి గురించి తాను మాట్లాడనని, ఆ విషయం భట్టి విక్రమార్క చూసుకుంటారని చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రావొద్దనడం మంచి పద్దతి కాదనీ, పొరుగు రాష్ట్రాల సీఎంలుగా జగన్, ఫడ్నవీస్‌లను ఆహ్వానిస్తే తప్పులేదన్నారు.
 

మరిన్ని వార్తలు