రేపు గాంధీ ఆస్పత్రిపై హెలికాఫ్టర్‌లతో పూల వర్షం

2 May, 2020 17:01 IST|Sakshi

సిబ్బందిపై పూల వర్షం కురిపించనున్న ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో కీలకమైన వేదికగా మారిన గాంధీ ఆస్పత్రిలో ఆదివారం (మే 3) రోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి  కబళిస్తున్న వేళ..  కరోనా ఫైటర్స్ గా మారి చికిత్స అందిస్తున్న ‘గాంధీ’ వైద్యులపై పూల వర్షం కురవబోతుంది. 

గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ బారిన పడిన రోగులకు సేవలు అందించేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. సెలవులను సైతం రద్దు చేసుకొని వైద్యం అందిస్తున్నారు. వీరి కృషి వల్ల ఎందరో బాధితులు కోలుకొని ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో గాంధీ వైద్య సిబ్బందికి అభినందనలు తెలపడానికి ఎయిర్‌ ఫోర్స్‌ ముందుకు వచ్చింది. కరోనాని జయిస్తున్న  వైద్యులు, ఇతర సిబ్బందికి సంఘీభావంగా రేపు ఉదయం 9.30 గంటలకు గాంధీ ఆస్పత్రిపై హెలికాఫ్టర్‌లతో పూల వర్షం కురిపించబోతున్నారు. 
(చదవండి : వైద్యురాలికి ఘన స్వాగతం.. భావోద్వేగం)

గాంధీ ఆసుపత్రి ఆవరణలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద డాక్టర్లు. నర్సులు. తెలంగాణ పోలీసు అధికారులు, మినిస్టీరియల్, పారామెడికల్, 4వ తరగతి సిబ్బంది, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సహా అందరూ హాజరు కావాలని హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు కోరారు. వీరందరిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించి అభినందనలు తెలియజేయాలని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్ణయించింది. ఎయిర్ ఫోర్స్ అధికారుల సూచన మేరకు సిబ్బంది అంతా తమ యూనిఫాంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద హాజరు కావాలని.. ఎయిర్ ఫోర్స్ అందించే ప్రశంశలను అందుకోవాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కోరారు.

కాగా, వైద్యులు చేస్తున్న కృషికి సంఘీభావంగా దేశ వ్యాప్తంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందిపై ఆదివారం హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించనున్నారు. 

మరిన్ని వార్తలు