ఖాళీయే!

13 Jan, 2015 04:40 IST|Sakshi
ఖాళీయే!

* ఐఏఎస్‌ల కేటాయింపు లేనట్లే !
* జేసీ, కమిషనర్‌లు ఇక కష్టమే
* బదిలీల సందర్భంగా దక్కని ఛాన్స్
* కలెక్టర్‌గా రొనాల్డ్‌రోస్ కొనసాగింపు
* జేసీ నియామకంపై వీడని సస్పెన్స్


సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కొంతకాలంగా జిల్లాలో ఖాళీగా ఉన్న జాయింట్ కలెక్టర్ పోస్టుతో పాటు కీలక పదవుల నియామకానికి మోక్షం కలగడం లేదు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 24 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకంలోనూ జిల్లాకు అవకాశం దక్కలేదు. నిజామాబాద్ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని నియమించాల నే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.

మూడు నెలల కిందట జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ సైతం నిజామాబాద్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చిన నేపథ్యంలో కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్లు ప్రకటించారు. 20 రోజుల కిందటి వరకు ఇన్‌చార్జ్ కమిషనర్‌గా వ్యవహరించిన మంగతాయారును సమగ్ర కుటుంబ సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు పలు అక్రమాలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో బదిలీ చేశారు. ఆమె స్థానంలో నియమితులైన సత్యనారాయణ విధులలో చేరలేదు. దీంతో నిజామాబాద్ ఆర్‌డీఓ యాదిరెడ్డి ఇన్‌చార్జ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
అప్పటి నుంచి
అంతకుముందు కలెక్టర్‌గా ఉన్న ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ గా ఉన్న డి.వెంకటేశ్వర్‌రావు జూన్ 17న బదిలీ అయ్యారు. కలెక్టర్‌గా రొనాల్డ్‌రోస్‌కు పోస్టింగ్ ఇవ్వగా, జేసీగా మాత్రం ఎవరినీ నియమించ లేదు. సోమవారం ప్రభుత్వం 24 మంది పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పొరుగు జిల్లాలలో కొందరు కలెక్టర్లకు స్థానచలనం కల్పించడంతోపాటు ఖాళీగా ఉన్న చోట జేసీ, కార్పొరేషన్‌ల కమిషనర్లుగా ఐఏఎస్‌లను నియమించారు.

జిల్లాకు మాత్రం ఎవరినీ కేటాయించ లేదు. రొనాల్డ్‌రోస్ కలెక్టర్‌గా కొనసాగనున్నారు. ఆయనను ఆంధ్రకు కేటాయించినప్పటికీ, తెలంగాణకే ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రానికి రాసిన లేఖకు సానుకూల స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం రోస్‌ను కొనసాగించింది. జాయింట్ కలెక్టర్, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌ల నియామకంపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. అడిషనల్ జేసీగా ఉన్న డాక్టర్ పి.శేషాద్రి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఆ పోస్టు కూడ ఖాళీనే.

మరిన్ని వార్తలు