పెద్ద సార్ల ఆటవిడుపు

10 Dec, 2018 02:08 IST|Sakshi
గిల్లీదండ ఆడుతున్న సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌ రావు

కండ్లకోయ పార్కులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల కలయిక

ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపిన అధికారులు..  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా తీరిక లేకుండా గడిపిన అఖిల భారత సర్వీసుల సీనియర్‌ అధికారులు ఈ ఆదివారం తమ కుటుంబాలతో కండ్లకోయలో హాయిగా సేద తీరారు. గడిచిన శుక్రవారం పోలింగ్‌ ముగిసేదాకా సెలవులు లేకుండా విధులు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు ఈ ఆదివారం మాత్రం ఆటవిడుపుగా మారింది. అటవీ శాఖకు చెందిన కండ్లకోయ వనక్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడిపారు. నగర శివార్లలోని ఆక్సిజన్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లో వీరు ఆత్మీయంగా కలుసుకుని వన భోజనాలు చేశారు.

ఆటపాటలతో సరదాగా గడుపుతున్న సీపీ అంజనీకుమార్‌ తదితరులు 
ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌ రావు, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ) మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌ చందా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి అధర్‌ సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్, పీసీసీఎఫ్‌ పీకే ఝా, సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ తదితర అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ కార్యక్రమానికి హాజరై ఉల్లాసంగా గడిపారు. గత మూడు నెలలుగా ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా గడిపిన డీజీపీ, సీపీతో పాటు పలువురు ఇతర అధికారులు కొద్దిసేపు రాజకీయ చర్చలు, పాలనా వ్యవహారాల ముచ్చట్లను పక్కనబెట్టి గ్రామీణ క్రీడలు, ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు. 

>
మరిన్ని వార్తలు