కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించిన ఐఏఎస్‌లు

6 Aug, 2017 03:13 IST|Sakshi
కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించిన ఐఏఎస్‌లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును శనివారం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బృందం సందర్శించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా నేతృత్వంలో ఐఏఎస్‌ అధికారులు చిత్రా రాంచంద్రన్, రాజేశ్వర్‌ తివారీ, రాజీవ్‌ త్రివేదీ, శశాంక్‌ గోయెల్, సునీల్‌వర్మ, అశోక్‌కుమార్, జయేశ్‌రంజన్, వికాస్‌రాజ్, శివశంకర్, వెంకటేశం, అనితా రాజేంద్రతో పాటు 9 మంది ట్రైనీ ఐఏఎస్‌లు ఉదయం హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతిష్టాత్మక ప్యాకేజీ–8ను పరిశీలించారు.

ఈ ప్యాకేజీలో కీలక భూగర్భ పంప్‌హౌస్‌తో పాటు సర్జ్‌పుల్, ట్విన్‌టెన్నల్స్, 400 కేవీ సబ్‌స్టేషన్, డెలివరీ సిస్టం, డెలివరీ మెయిన్స్, గ్రావిటీ కెనాల్స్‌ను పరిశీలించారు. పనులకు సంబంధించిన వివ రాలను మెఘా ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఏజీఎం రామకృష్ణ, కృష్ణారెడ్డి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారని ఐఏఎస్‌ అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఆసక్తితో వచ్చినట్లు చెప్పారు. నవంబర్‌ చివరలో ట్రయల్‌ రన్‌ నిర్వహిం చనున్నట్లు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషీ పేర్కొన్నారు. కాల్వ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ సమస్యలున్నాయని, నెల రోజుల్లో దాన్ని పూర్తి చేస్తామని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ చెప్పారు. ఈ నెల 8న ఐపీఎస్‌ అధికారుల బృందం ప్రాజెక్టు పనులను పరిశీలించనుంది.

మరిన్ని వార్తలు