డాక్టర్‌ కలెక్టర్‌..

8 Mar, 2018 08:29 IST|Sakshi

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ డా. యోగితా రాణా

ఎంబీబీఎస్‌ చదివి సివిల్స్‌ రాశా

అమ్మ ప్రోత్సాహంతో ముందడుగు   

మహిళలకు దృఢమైన సంకల్పం ఉండాలి

ప్రజలకు దగ్గరినుంచి సేవలందించడం సంతృప్తినిస్తోంది

డాక్టర్‌గా రోగులకు సేవ చేయాలనుకుని ఆ వృత్తిలోకి అడుగు పెడితే అక్కడజరుగుతున్న అక్రమాలు వెక్కిరించాయి. ధైర్యంగా ఎదిరిస్తే వేధింపులుపెరిగాయి. లాభం లేదని సమస్యను ఐఏఎస్‌ అధికారికి దృష్టికి తీసుకెళ్లగానే సమస్య పరిష్కారమైంది. ఈ ఒక్క సంఘటన ఆమెలో చాలా మార్పులుతెచ్చింది. ‘నేనూ ఐఏఎస్‌ చదివితే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించవచ్చు కదా..!’ అని ప్రశ్నించుకుని ఆ దిశగా అడుగులు వేసిందామె. తల్లి ప్రోత్సాహంతో అనుకున్నది సాధించి.. సర్వీసులో పేదల పక్షాననిలిచారు. ఆమే ప్రస్తుత హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా యోగితా తనమనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

సాక్షి, సిటీబ్యూరో: ఐఏఎస్‌కు ఎంపికయ్యాక ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. విశాఖ జిల్లాలో ఏడాది పాటు శిక్షణ పూర్తి చేశా. ఏజెన్సీలో నెల రోజులపాటు ఉండడంతో గిరిజనుల పరిస్థితులపై అవగాహన వచ్చింది. అక్కడి మహిళలతో మమేకమయ్యా.  భద్రాచలం సబ్‌ కలెక్టర్‌గా, రంపచోడవరం ఐటీడీఏ పీఓగా పనిచేసినప్పుడు మహిళల భాగస్వామ్యంతో ఎన్నో అభివృద్ధి పనులు చేశా. గిరిజనుల ఆదరణ మరువలేని అనుభూతిగా మిగిలింది. మూడున్నరేళ్లు  యూఎన్‌డీపీలో పనిచేశా. గ్రామీణ అభివృద్ధిపై పూర్తిగా పట్టు సాధించాను. ఐఏఎస్‌లో ఉండి కూడా గ్రామీణాభివృద్ధిపై పీజీ కోర్సు చేశా. గ్రామీణ ప్రజలకు దగ్గరి నుంచి సేవలందించే అవకాశం లభించడం తృప్తి కలిగించింది.

పుట్టింది.. పెరిగింది జమ్మూలోనే. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఏం చేయాలనే దానిపై స్పష్టత లేదు. ఇంటర్‌లో ఆర్ట్స్‌ గ్రూప్‌ తీసుకున్నా. తర్వాత డాక్టర్‌ కావాలని వెంటనే సైన్స్‌ గ్రూప్‌లోకి మారిపోయా. 

జమ్మూ మెడికల్‌ కళాశాలలో వైద్య విద్య అభ్యసించాను. పీహెచ్‌సీలో ఇంటర్నషిప్‌ చేస్తున్నప్పుడు అక్కడి పరిస్థితులు బాధ కలిగించాయి. వైద్య సేవల్లో పారదర్శకత లేదు. మందులను ఇతర ప్రయోజనాలకు వాడుతున్నారు. ఈ విషయంపై సూపరింటెండెంట్‌కు లేఖ రాశాను. స్పందన లేదు కదా సమస్యలు మరింత పెరిగాయి. అ సమయంలో కమిషనర్‌గా ఓ యువ ఐఏఎస్‌ అధికారి వచ్చారు. ఆయన జోక్యంతో పీహెచ్‌సీలో మార్పు వచ్చింది. అప్పుడే అనుకున్నా సివిల్స్‌తోనే సమాజంలో మార్పు సాధ్యమని. 

అప్పటికే మా అన్నయ్య డానిష్‌ రాణా ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. దీంతో నేనూ ఐఏఎస్‌ కావాలని నిర్ణయిచుకున్నా. మా అమ్మ కూడా నన్ను అలాగే చూడాలనుకుంది. దాంతో నాలో పట్టుదల పెరిగి పరీక్షలు రాశా. మొదటిసారి మెయిన్స్‌ క్లియర్‌ అయినా ఇంటర్వ్యూ రాలేదు. రెండోసారి ప్రిలిమ్స్‌ దగ్గరే ఆగిపోయింది. మూడో ప్రయత్నంలో ఐఆర్‌టీఎస్‌ వచ్చింది. నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌కు 2003 బ్యాచ్‌కు ఎంపికయ్యాను.

మహిళలకు దృఢమైన సంకల్పం, తనపై తనకు నమ్మకం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలదు. మాతృమూర్తిలో మార్పు చాలా అవసరం. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. తండ్రి కంటే తల్లికే పిల్లల మాటలు అర్థమవుతాయి. ఆడపిల్లలను చదివించాలి. ప్రయోజకులను చేయాలి. అన్నింటికీ విద్య ప్రధాన మూలం. చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలి.  

ఐఏఎస్‌గా పనితీరు గుర్తింపు ఇస్తోంది. ముందుగా ఉద్యోగులకు ఒక క్లారిటీ ఇవ్వాలి. అప్పుడే టీం వర్క్‌తో మంచి ఫలితాలు వస్తాయి. నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు కేంద్రం నుంచి ఎన్‌ఆర్‌ఈజీఏ కింద ఉత్తమ జిల్లాగా గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తమ కలెక్టర్‌గా అవార్డు అందించింది. ప్రధాని చేతులు మీదుగా ఈ–నామ్‌ ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకున్నాను. తాజాగా బేటీ బచావో బేటీ పడావో అవార్డు కూడా వచ్చింది. 

మరిన్ని వార్తలు