పట్నం సీటు సైకిల్‌కు..

15 Nov, 2018 14:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాజేంద్రనగర్‌ కూడా  టీడీపీ ఖాతాలోకే.. సామ రంగారెడ్డి, గణేష్‌గుప్తా పేర్లు ఖరారు కాంగ్రెస్‌కు షాద్‌నగర్, మేడ్చల్‌ ప్రతాపరెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి కేటాయింపు  మల్‌రెడ్డి, క్యామలకు ఝలక్‌..

ఇబ్రహీంపట్నం టికెట్‌ కోసం పోటాపోటీగా ప్రయత్నించిన డీసీసీ అధ్యక్షుడు మల్లేష్, మల్‌రెడ్డి బ్రదర్స్‌కు కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం షాకిచ్చింది. వైరి వర్గాలుగా విడిపోయి ఢిల్లీలో మకాం వేసిన ఈ ఇరువురు నేతలకు టీడీపీతో పొత్తు అశనిపాతంలా మారింది. తామిద్దరికీ కాకుండా సీటు తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లిపోవడం ఖంగు తినిపించింది. వీరిద్దరు టికెట్‌ తమ కంటే.. తమకంటూ వారం రోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు. వీరి ప్రచారానికి ఎట్టకేలకు బుధవారం రాత్రి ఫుల్‌స్టాప్‌ పడింది. అయితే టీడీపీకి సీటు కేటాయించడాన్ని నిరసిస్తూ మల్‌రెడ్డి, క్యామ బరిలో దిగే ఆలోచన చేయవచ్చనే ప్రచారం సైతం జరుగుతోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రోజుకో మలుపు తిరుగుతున్న మహాకూటమి పొత్తు వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది. అనూహ్యంగా ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌ సీట్లను తెలుగుదేశం పార్టీ ఎగరేసుకుపోయింది. మొదటి నుంచి ఈ సీట్లపై కన్నేసిన కాంగ్రెస్‌ పార్టీ ఆఖరి నిమిషంలో టీడీపీ అధిష్టానానికి అయిష్టంగానే తలూపింది. జిల్లాలో ఇప్పటికే శేరిలింగంపల్లి సీటును టీడీపీకి సర్దుబాటు చేయగా తాజాగా ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌ సీట్లను కూడా ఆ పార్టీకి వదిలేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. దీంతో బుధవారం రాత్రి టీడీపీ విడుదల చేసిన రెండో జాబితాలో సామ రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), గణేష్‌గుప్తా (రాజేంద్రనగర్‌) పేర్లను ఖరారు చేసింది. వాస్తవానికి ఎల్బీనగర్‌ సీటును ఆశించిన సామ రంగారెడ్డి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే ఇదే సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్‌ ససేమిరా అంది. దీంతో టీడీపీ అనివార్యంగా ఎల్బీనగర్‌ స్తానే ఇబ్రహీంపట్నం సీటును తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు సామ రంగారెడ్డిని ఇబ్రహీంపట్నంలో సర్దుబాటు చేసింది. ఇక రాజేంద్రనగర్‌ విషయంలోనూ అవే పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్నేళ్లుగా ఈ సీటు తనకే దక్కుతుందని భరోసాతో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్తీక్‌రెడ్డికి టీడీపీ రూపేణా ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీటుకు టీడీపీ అభ్యర్థిగా గణేష్‌ గుప్తా పేరును ఖరారు చేస్తూ నిర్ణయం వెలువడడం కాంగ్రెస్‌ శ్రేణులను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో స్నేహపూర్వక పోటీ నెలకొంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
 
కాంగ్రెస్‌ ఖాతాలో షాద్‌నగర్, మేడ్చల్‌ 
కాంగ్రెస్‌ పార్టీ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన రెండో విడత జాబితాలో షాద్‌నగర్, మేడ్చల్‌ అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా ప్రకటించిన జాబితాలో చౌలపల్లి ప్రతాపరెడ్డి (షాద్‌నగర్‌), కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (మేడ్చల్‌) పేర్లు ఉన్నాయి. తొలి లిస్టులోనే వీరికి చోటు లభిస్తుందని భావించినప్పటికీ సామాజిక సమతూకం, 

మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు కారణంగా పెండింగ్‌లో ఉంచింది. ఎల్‌బీనగర్‌ సెగ్మెంట్‌ దాదాపుగా సుధీర్‌రెడ్డికి ఖారారైనట్లేనని తెలుస్తోంది. ఈ స్థానాన్ని ఆశిస్తున్న టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం కేటాయించడంతో సుధీర్‌రెడ్డికి ఒక రకంగా మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం విడుదల చేసే మూడో జాబితాలో ఈయన పేరు ఉండే అవకాశముంది. కూకట్‌పల్లి నియోజకవర్గం విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది 

మరిన్ని వార్తలు