టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు..!

12 Jun, 2014 02:15 IST|Sakshi
టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు..!

- చంద్రశేఖర్‌రెడ్డిని నిలదీసిన స్థానిక నాయకులు
- తమను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
- మీడియా ఎదుటే నాయకుల వాదులాట

ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇష్టారీతిగా సమావేశాలు ఏర్పాటు చేసి స్థానికులను అవమానిస్తున్నారని ఓ వర్గం.. పదవులు కాదు ప్రజల కోసం పనిచేస్తేనే పార్టీ బతుకుతుందని మరో వర్గం వాదులాడుకున్నాయి.
 
స్థానికులను విస్మరిస్తున్నారు..!
స్థానికంగా ఓ ఫంక్షన్‌హాల్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పట్నం నుంచి పోటీ చేసిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. అయితే ఈ సమావేశానికి స్థానిక నాయకులను ఎందుకు పిలవలేదంటూ పార్టీ మండల అధ్యక్షుడు బోసుపల్లి వీరేశ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మిగితా నాయకులు కూడా కలుగజేసుకుని స్థానికులను దెబ్బతీసేందుకే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రశేఖర్‌రెడ్డిపై మండిపడ్డారు. పార్టీ ఆవిర్భవ నాటినుంచి తాము శ్రమిస్తే ఇప్పుడు కొత్తగా వచ్చినవారు తమను విస్మరిస్తున్నారన్నారు. సొంత కళాశాలలో తనకు ఇష్టమొచ్చిన వారితో సమావేశాలు ఏర్పాటు చేసి.. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ లోపంతో ఇతర పార్టీల దృష్టిలో టీఆర్‌ఎస్‌ను చులకన చేసే చర్యలు మానుకోవాలని సూచించారు.
 
పార్టీ కోసం పనిచేస్తే తప్పా
 స్థానిక నాయకుల నుంచి ముప్పేటా దాడి ఎదురుకావడంతో చంద్రశేఖర్‌రెడ్డి కాసేపు మిన్నకుండిపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ పదవుల కోసం తాను సమావేశాలు చేపట్టడం లేదని చెప్పారు. పార్టీకి, ప్రజలకు సేవ చేసేందుకే తాపత్రయపడుతున్నానని ఆవేశంతో అన్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో వుంది కాబట్టి.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకున్న పరిచయాలతో నిధులు రాబట్టాలని కృషి చేయడం తప్పా అని ప్రశ్నించారు. ఒకరినొకరు విమర్శించుకోవడం వల్ల పార్టీకి కలిగే లాభమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర నాయకుడు డబీకార్ శ్రీనివాస్ కలుగజేసుకుంటూ స్థానిక నాయకులను విస్మరిచవద్దని సూచించారు. అయితే సీనియర్ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి, జేపీ శ్రీనివాస్, బర్ల జగదీశ్ యాదవ్‌లు ఈ గొడవలో జోక్యం చేసుకోకుండా సెలైంట్‌గా వుండిపోయారు.

>
మరిన్ని వార్తలు