పీడీ మాకొద్దు

3 Sep, 2014 03:23 IST|Sakshi

మంకమ్మతోట : ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్‌కు.. ఆ శాఖ ఉద్యోగులకు మధ్య ఏడాదికాలంగా జరుగుతున్న వివాదం మంగళవారం మరింత ముదిరింది. ఉద్యోగులు సహకరించడం లేదంటూ వేధిస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. పీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగులు పెన్‌డౌన్ సమ్మెకు దిగారు. సమ్మెను విరమింపచేసేందుకు ఐసీడీఎస్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జయరామ్ నాయక్ జరిపిన చర్చలు ఫలించలేదు. పీడీ మోహన్‌రెడ్డి బదిలీపై వెళ్లిపోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.  
 
 ఈనెల 27నుంచి పీడీ వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఉద్యోగుల సంఘం జిల్లా నాయకత్వం చర్చలు జరిపినా సద్దుమణగకపోవడంతో రాష్ర్టం నాయకులు రంగంలోకి దిగారు. రెండు గంటలపాటు జరిపిన చర్చలు ఉద్యోగుల ఆరోపణలతో వాడివేడిగా కొనసాగాయి. ఏడు నెలలుగా ఫైళ్లు తన వద్దనే పెట్టుకుని సొంత పనులు చేసుకుంటున్నారని, ఉద్యోగులకు పనిచేయడం రాదని ఇతరులతో చెబుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
 
  చర్చల్లో తనపై వచ్చిన ఆరోపణలపై పీడీ స్పందించకపోగా.. ఉద్యోగులు కార్యాలయ పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, పీడీ అని గౌరవం లేకుండా మాట్లాడతున్నారంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో ఉద్యోగులు చర్చల నుంచి బయటికొచ్చి పీడీ వెళ్లిపోవాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రెండు రోజుల్లో పీడీ సెలవులో వెళ్లిపోతున్నట్లు ఉద్యోగవర్గాల ద్వారా తెలిసింది. పీడీ సెలువుపై వెళ్లిపోకపోతే ఉద్యోగులంతా మూకుమ్మడి సెలవుపై వెళ్లిపోతామని వారు స్పష్టం చేశారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు