ఆలయాల్లోనూ ర్యాపిడ్‌ టెస్టులు! 

18 Jul, 2020 03:10 IST|Sakshi

కరోనా పరీక్షల నిర్వహణపై ఐసీఎంఆర్‌ పరిశీలన

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలూ కోరుతున్నట్లు వెల్లడి

ఇక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ర్యాపిడ్‌ టెస్టులకు ఓకే

ర్యాపిడ్‌లో నెగెటివ్‌ వచ్చి లక్షణాలుంటేనే ఆర్‌టీ–పీసీఆర్‌  

సాక్షి, హైదరాబాద్ ‌: దేవాలయాల్లోనూ కరోనా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేసే అంశాన్ని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) పరిశీలిస్తోంది. అలాగే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ ర్యాపిడ్‌ టెస్టులు చేసే అంశంపై కసరత్తు చేస్తోంది. ర్యాపిడ్‌ టెస్టులకు అనుమతి ఇవ్వాలని దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల నుంచి వినతులు వస్తున్నాయని ఐసీఎంఆర్‌ ప్రకటించింది. ఆయా విన్నపాలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. అరగంటలోపే కరోనా నిర్ధారణ అవుతుండటంతో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులకు ప్రాధాన్యం ఏర్పడింది. కేరళతోపాటు బెంగళూరు వంటి చోట్ల ఎక్కడికక్కడ రోడ్లపైనే పెద్ద ఎత్తున ర్యాపిడ్‌ టెస్టులు చేశారు. కాబట్టి దేవాలయాల్లోకి వచ్చే భక్తులకు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లోని ఉద్యోగులకు చేయడానికి అభ్యంతరం ఏమీ ఉండబోదని అంటున్నారు. 

అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులకూ ‘ర్యాపిడ్‌’ అనుమతి
అర్హతగల అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లలోనూ ర్యాపిడ్‌ టెస్టులకు అనుమతి ఇవ్వాలని ఐసీఎంఆర్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులకు మాత్రమే కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, లేబొరేటరీలకు అనుమతి ఉంది. ర్యాపిడ్‌ టెస్టులు కేవలం నిర్దేశించిన కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే చేస్తున్నారు. తెలంగాణలో కేవలం హైదరాబాద్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లోనే చేస్తున్నారు. ఇక నుంచి అన్ని జిల్లాల్లోనూ కింది స్థాయిలోని అర్హతగల అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులకు ఐసీఎంఆర్‌ అనుమతించింది. ఈ మేరకు తమకు దరఖాస్తు చేసుకోవాలని ఆసుపత్రులకు ఐసీఎంఆర్‌ సూచించింది.

ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో డేటా ఎంట్రీ కోసం లాగిన్‌ పొందాలని కోరింది. యాంటి జెన్‌ పరీక్షల సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరని తెలిపింది. కరోనా లక్షణాలున్న వారికి జిల్లా, మున్సిపల్‌ అధికారులు ర్యాపిడ్‌ టెస్టులు  చేయించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు చొరవ చూపించాలని పేర్కొంది. అందుకోసం జిల్లా, మున్సిపాలిటీలవారీగా నోడల్‌ అధికారులను నియమించాలని కోరింది. ప్రజలను, వారి జీవనోపాధిని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకుంది. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్‌ వ్యూహాలతో ర్యాపి డ్‌ టెస్టులు నిర్వహించాలని తేల్చిచెప్పింది.

లక్షణాలుంటేనే  ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష... 
ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలో పాజిటివ్‌ వస్తే వంద శాతం పాజిటివ్‌గానే గుర్తిస్తారు. ఒకవేళ నెగెటివ్‌ వస్తే దాని కచ్చితత్వం కేవలం 50 నుంచి 70 శాతమేనని, అటువంటి వారికి తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్ట్‌ చేయాలని ఐసీఎంఆర్‌ గతంలోనే ప్రకటించింది. అయితే ఇప్పుడు దానికి కొంత సవరణ చేసింది. నెగెటివ్‌ వచ్చిన వారందరికీ ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష అవసరం లేదని, వారిలో కేవలం కరోనా లక్షణాలున్న వారికి మాత్రమే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయాలని తాజాగా పేర్కొంది. అంటే లక్షణాలు లేని వారికి యాంటిజెన్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వస్తే ఇక నుంచి నూటికి నూరు శాతం నెగెటివ్‌గానే గుర్తిస్తారని స్పష్టం చేసింది. ఈ మార్పును వైద్యాధికారులు, ప్రజలు గమనించాలని కోరింది.   

మరిన్ని వార్తలు