కొత్త శనగ వంగడాల సృష్టికి మార్గం సుగమం!

1 May, 2019 02:08 IST|Sakshi

ఇక్రిశాట్‌ పరిశోధనలో శనగలో మేలైన లక్షణాలివ్వగల జన్యువుల గుర్తింపు

కరువు కాటకాలను తట్టుకుని అధిక దిగుబడి అందించే సామర్థ్యం

మూడేళ్ల పరిశోధనలో పాలుపంచుకున్న పలు జాతీయ,

అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్‌లు  

సాక్షి, హైదరాబాద్‌: కరువు కాటకాలను తట్టుకుని ఎక్కువ దిగుబడులు ఇవ్వగల సరికొత్త శనగ వంగడాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) నేతృత్వంలో జరిగిన ఓ అంతర్జాతీయ పరిశోధన శనగలో మేలైన లక్షణాలను అందివ్వగల జన్యువులను గుర్తించారు. దాదాపు 45 దేశాల్లోని 429 రకాల శనగ పంటల జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు అందులోని జన్యువైవిధ్యతను అంచనా వేయగలిగారు. శనగ మొట్టమొదట ఏ ప్రాంతంలో పుట్టింది? ఆసియా, ఆఫ్రికాల్లోకి ఎలా ప్రవేశించిందన్న విషయాలనూ తెలుసుకోగలిగారు. సుమారు 200 ఏళ్ల క్రితం మధ్యదరా ప్రాంతం నుంచి ఈ శనగ పంట అఫ్గానిస్తాన్‌ మీదుగా భారత్‌కు వచ్చింది.

అదే సమయంలో ప్రపంచానికి ఈ పంట మధ్యదరా ప్రాంతం నుంచి కాకుండా మధ్యాసియా లేదా తూర్పు ఆఫ్రికా ప్రాంతం నుంచి విస్తరించడం గమనార్హం. శనగ జన్యుక్రమాన్ని నిర్దిష్ట లక్ష్య సాధన కోసం పునఃసమీక్షించడంలో ఇదే అతిపెద్ద పరిశోధన. దీనిద్వారా లభించిన సమాచారంతో వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, చీడపీడలను తట్టుకునే కొత్త వంగడాలను సృష్టించడం సులువు కానుంది. మూడేళ్లు శ్రమపడి శాస్త్రవేత్తలు జరిపిన ఈ అధ్యయనం వివరాలు నేచర్‌ జెనిటిక్స్‌ ఆన్‌లైన్‌లో ప్రచురితమయ్యాయి. పప్పు ధాన్యాలకు దేశం లో డిమాండ్‌ ఉన్నప్పటికీ సాగు, దిగుబడులు లేవు. ఈ నేపథ్యంలో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలనేకం ఈ అంతర్జాతీయ పరిశోధనలో పాలుపంచుకున్నాయి.
 
90 శాతం సాగు ఇక్కడే..
ప్రపంచవ్యాప్త శనగ సాగులో దక్షిణాసియా ప్రాంతం వాటా దాదాపు 90 శాతం. అయితే వర్షాభావం, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా దిగుబడులు తగ్గిపోతున్నది కూడా ఇక్కడే ఎక్కువ. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా రబీ సీజన్‌ పంట అయిన శనగకు నష్టమెక్కువగా జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తాము గుర్తించిన ఆర్‌ఇఎన్‌–1, 3–గ్లుకనేస్, ఆర్‌ఈఎఫ్‌ 6 జన్యువులు, ఉపయోగపడతాయని, వీటిని నియంత్రించడం ద్వారా పంటలు 38 డిగ్రీ సెల్సియస్‌ వేడిని తట్టుకోవడమే కాకుండా ఎక్కువ దిగుబడి సాధించవచ్చునని ఇక్రిశాట్‌ శాస్త్రవేత్త, అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ రాజీవ్‌ వార్‌‡్షణీ తెలిపారు.

అంతర్జాతీయ బృందం అధ్యయనం కారణంగా శనగకు సంబంధించి అనేక కొత్త విషయాలు తెలిశాయని, వీటి ఆధారంగా వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త వంగడాలను ఉత్పత్తి చేయవచ్చునని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పీటర్‌ కార్‌బెర్రీ తెలిపారు. ఈ పరిశోధన రైతులకు మరింత ఆదాయం తెచ్చిపెడుతుందని, ఇక్రిశాట్‌ లాంటి సంస్థతో కలసి పనిచేయడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని గ్లోబల్‌ క్రాప్‌ డైవర్సిటీ ట్రస్ట్‌ (జర్మనీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మేరీ హాగా హర్షం వ్యక్తంచేశారు. ఈ పరిశోధనలో బీజీఐ (చైనా), ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ), ఫ్రెంచ్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ (ఐఆర్‌డీ, ఫ్రాన్స్‌), ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌), యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ (బెంగళూరు)లతోపాటు కీనా, ఇథియోపియా, కొరియా, అమెరికా, మెక్సికో, ఆస్ట్రేలియాలకు చెందిన పలు పరిశోధన సంస్థలు పాల్గొన్నాయి.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు