ఆధునిక శోధనం.. అవసరానుగుణ విత్తనం 

17 Feb, 2020 02:57 IST|Sakshi
ర్యాపిడ్‌జెన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రిబ్బన్‌ కట్‌ చేస్తున్న పీటర్‌కార్‌బెరి. చిత్రంలో దబానే తదితరులు

రెండేళ్లలో నచ్చిన లక్షణాలున్న వంగడాల ఉత్పత్తి ∙

‘సాక్షి’తో ఇక్రిశాట్‌ శాస్త్రవేత్త యాన్‌ దబానే 

ఒకపక్క జనాభా పెరిగిపోతోంది.. వాతావరణ మార్పుల ప్రభావం ముంచుకొస్తోంది.. కానీ.. అందుబాటులో ఉన్న సాగుభూమి పెరగదు సరికదా.. దిగుబడులూ తగ్గిపోయే ప్రమాదమూ వెన్నాడుతోంది.ఈ వీటిని పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది.మన అవసరాలకు తగ్గ కొత్త పంటలను అభివృద్ధి చేసేందుకు పట్టే సమయాన్ని సగానికి తగ్గించేందుకు.. వంగడ అభివృద్ధి ఆధునికీకరణను చేపట్టింది. ఆ పరిశోధనలేమిటో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త యాన్‌ దబానేను ‘సాక్షి’ సంప్రదించింది.. ఇవీ ఆ వివరాలు... 

ప్రశ్న: వంగడాల అభివృద్ధి ప్రక్రియను ఆధునికీకరించాలనే ఇక్రిశాట్‌ నిర్ణయం వెనుక ఉద్దేశం? 
జవాబు: ఒక్కమాటలో చెప్పాలంటే.. కొత్త, వినూత్న లక్షణాలున్న వంగడాలను వేగంగా అభివృద్ధి చేయడమే. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని విత్తన కంపెనీలు విజయవంతంగా వాడిన సాంకేతికత, పద్ధతులను సామాన్య రైతులకు అందుబాటులోకి తేవాలని ఇక్రిశాట్‌ ఈ విత్తన ఆధునికీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలోని ఇక్రిశాట్‌ ప్రధాన కేంద్రంలో ‘ర్యాపిడ్‌జెన్‌’ పేరిట ప్రారంభించిన వ్యవస్థ ఈ దిశగా వేసిన తొలి అడుగు.  

ప్ర:  ‘ర్యాపిడ్‌జెన్‌’ వ్యవస్థ తొలి అడుగు అంటున్నారు. ఇంకా ఎలాంటి సాంకేతికత, పద్ధతులు దీంట్లోకి చేర్చవచ్చు? 
జ:   చాలా ఉన్నాయి. పంటలకు సంబంధించి నాణ్యమైన సమాచారం రాబట్టేందుకు ‘ర్యాపిడ్‌జెన్‌’ఉపయోగపడుతుంది. విత్తనోత్పత్తికి, పంట దిగుబడి, నాట్లకు చెందిన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయవచ్చు. చీడపీడలను తట్టుకోవడంతోపాటు కరవు కాటకాలను, విపరీతమైన వేడిమిని ఓర్చుకునే పంటలు, మంచి పోషకాలు ఇవ్వగల వంగడాలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న మాలిక్యులర్‌ మార్కర్‌ టెక్నాలజీలను (కణస్థాయిలో మార్పులు చేయడం ద్వారా మొక్కల లక్షణాలను నియంత్రించడం) కూడా ఇందులో వాడుకోవచ్చు.  

ప్ర:  ఇక్రిశాట్‌ చేపట్టిన వంగడ ఆధునికీకరణ పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? 
జ:   సాంకేతికత అనేది కాలంతోపాటు అభివృద్ధి చెందుతుంటాయి. కాబట్టి నిర్దిష్టంగా ఇంత సమయం అని చెప్పలేము.ఎప్పటికప్పుడు మరింత వృద్ధి చేసేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది.‘ర్యాపిడ్‌జెన్‌’ద్వారా చేపట్టిన కొన్ని కార్యక్రమాలను రానున్న రెండేళ్లలోనే రైతులకు అందుబాటులోకి తేవచ్చు. 

ప్ర: మీరు అమలు చేయబోయే టెక్నాలజీలపై ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందా? 
జ:  అలాంటిదేమీ లేదు. వంగడ అభివృద్ధి ఆధునికీకరణలో ఉపయోగిస్తున్న టెక్నాలజీలన్నీ ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా అమల్లో ఉన్నాయి.ఇక్రిశాట్‌ వాణిజ్య భాగస్వాములు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో ఎక్కడా ఎలాంటి వ్యతిరేక పరిణామాలు సంభవించలేదు. 

ప్ర: ఇక్రిశాట్‌ ప్రధానంగా ఆరు పంటల (రాగి, సజ్జ, జొన్న, కంది, శనగ, వేరుశనగ)పై మాత్రమే పనిచేస్తోంది.వంగడ అభివృద్ధి ఆధునికీకరణను ఇతర పంటలకు విస్తరించే ఆలోచన ఏదైనా ఉందా? 
జ: ఇక్రిశాట్‌ అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు ప్రభుత్వ పరిశోధన సంస్థలతోనూ కలిసి పనిచేస్తోంది. భారత్‌లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌తోపాటు అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమ అభివృద్ధి కేంద్రం, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం, ప్రపంచ కాయగూరల కేంద్రాలు వీటిలో ఉన్నాయి. మొక్కల అభివృద్ధికి ఇక్రిశాట్‌ ఈ సంస్థలకు తన దగ్గరున్న ఆరు పంటల జెర్మ్‌ప్లాసమ్‌ను సరఫరా చేస్తుంది. ఆయా సంస్థలు ఇతర పంటలపై కూడా పరిశోధనలు చేసుకుంటాయి. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ కేంద్రంలో ఇతర సంస్థలు కూడా పనిచేస్తున్నాయి.  

ప్ర: చిన్న, సన్నకారు రైతులకు ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుంది? 
జ: వాతావరణ మార్పుల నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. చీడపీడల సమస్య పెరిగిపోనుంది. మారుతున్న వాతావరణాన్ని తట్టుకోగల వంగడాల అవసరం మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇక్రిశాట్‌ చేపట్టిన వంగడ అభివృద్ధి ఆధునికీకరణ ద్వారా వీటికి వేగం గా పరిష్కారాలు లభించే అవకాశాలున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు