రేషన్‌షాపులు ఎత్తివేత ఆలోచన సరికాదు

2 Jun, 2017 01:28 IST|Sakshi

జైనథ్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ షాపులను ఎత్తేసి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసే నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలను మానుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కుంటాల రాములు అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతీ పౌరునికి చౌకగా ఆహారం పొంది జీవించే హక్కు ఉందన్నారు.

దీన్ని కాలరాసేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదన్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో అన్ని రకాల నిత్యావసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తుంటే తెలంగాణలో మాత్రం కేవలం బియ్యానికే పరిమితం కావడం బాగోలేదన్నారు. గతంలో ఇచ్చిన పప్పు, గోదుమలు, చక్కెర ఇలా అన్ని రకాల సరుకులను నిలిపి వేసిన ప్రభుత్వం రేషన్‌ షాపులను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇకనైన ఈ ఆలోచన మానుకొని, ప్రజలకు తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు పంపిణీ      చేయాలన్నారు.

మరిన్ని వార్తలు