ఐలమ్మ అందరికీ ఆదర్శం

11 Sep, 2014 03:54 IST|Sakshi
ఐలమ్మ అందరికీ ఆదర్శం

బంజారాహిల్స్: రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచిందని, ఆమె ఉద్యమ స్ఫూర్తితో రజకుల సమస్యలపై పోరాటం చేస్తామని రజక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి  చాకలి ఐలమ్మ 29వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రజక సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన రజక ఆత్మగౌరవ జెండాను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో  బీజేపీ మహిళా నేత పల్లె వీణా రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకురాలు విజయారెడ్డి, రజక సంఘం నేతలు రాధ, సింగారం శేఖర్,ఆర్ దేవేందర్,యాకయ్య,బాపురాజు,సాంబయ్య తదితరులున్నారు.
 
సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేయాలి

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: వృత్తిదారులకు సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ చేతి  వృత్తిదారుల సమన్వయ కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి  ఐలమ్మ 29వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీతారాములు మాట్లాడుతూ రజకులకు సామాజిక భద్రత చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటిన వృత్తిదారుల సమస్యలు  పరిష్కారం కావడంలేదన్నారు.

భూమి కోసం, భక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం ఐక్యంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ గ్రేటర్ కన్వీనర్ జి.నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, బ్యాండు,వాయిద్య కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఓగ్గు శ్రీనివాస్,నాయకులు నాగరాజు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
 
విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి


దోమలగూడ: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆమె వర్ధంతి, జయంతిలను ప్రభుత్వమే నిర్వహించాలని తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు.  తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఐలమ్మ 29వ వర్ధంతి సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ వర్ధంతిని పట్టించుకోకపొవడం, ట్యాంక్‌బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు.

తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆత్మ గౌరవం కోసం ఐలమ్మ జరిపిన పోరాటం నేటి తరాలకు ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూషరాజు యాదమ్మ, సహాయకార్యదర్శి రంగస్వామి, గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షుడు రామస్వామి, కార్యదర్శి స్వామి, నాయకులు కొమురయ్య, రత్పంరాజు, కె బి విజయ్‌కుమార్, ఎం రాజు, లక్ష్మినారాయణ, వెంకటేష్, యుంగధర్, భూతరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు