ఆదర్శ వివాహం

1 Jul, 2019 11:26 IST|Sakshi

సాక్షి, కేసముద్రం(వరంగల్‌): ఈ రోజుల్లో పెళ్లంటే ఆడపిల్ల తరఫున కట్నకానుకలు ఇవ్వడం.. భారీగా ఖర్చు చేసి వివాహం చేయడం సహజం.. అయితే ఎలాంటి కట్నకానుకలు ఆశించకుండా పెళ్లికొడుకే.. సొంత ఖర్చుతో ఆదర్శ వివాహం చేసుకున్న సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నద్దునూరి వెంకటమ్మ కుమారుడు ఎన్‌.అశోక్‌స్టాలిన్‌ బంధువైన మహబూబాబాద్‌ మండలం వీఎస్‌ లక్ష్మీపురానికి చెందిన ధర్మారపుసుశీల, బొందయ్య దంపుతుల కుమార్తె మౌనికతో పెద్దల సమక్షంలో పెళ్లి నిశ్చయమైంది.

అమ్మాయిది నిరుపేద కుటుంబం కావడంతో కట్నకానుకలేమీ లేకుండానే పెళ్లి చేసుకోవాలని అశోక్‌స్టాలిన్‌ నిర్ణయించుకున్నారు. వివాహానికి అయ్యే ఖర్చు సైతం తానే భరించి ఆదివారం అమీనాపురంలోని ఫంక్షన్‌ హాల్‌లో బంధువులు, స్నేహితులను పిలిచి వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రాన్ని గ్రామ కార్యదర్శి పెళ్లి మండపంలోనే వారికి అందజేశారు. అయితే పెళ్లి కార్డుపై ఎలాంటి ముహుర్తాలు లేకుండా, ఆదర్శవివాహ ఆహ్వనంగా ముద్రించి పంచడం చర్చనీశాంశమైంది. 

మరిన్ని వార్తలు