ఆరు సూత్రాలతో...ఆదర్శ గ్రామాలు

10 Feb, 2019 03:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పంచాయతీ పాలనను తీర్చిదిద్దే ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం

గంగదేవిపల్లి, అంకాపూర్‌ల సరసన ఇతర గ్రామాలు నిలిపేలా కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్‌: ఆరు ప్రాథమిక సూత్రాల ప్రాధాన్యంగా పల్లెసీమలను ప్రణాళికాయుత పంచాయతీ పాలన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గంగదేవిపల్లి, అంకాపూర్‌...పంచాయతీలను మార్గదర్శనంగా చేసి ఆదర్శ గ్రామాల వైపు అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో ప్రతీ పంచాయతీని అభివృద్ధి చేసేలా పంచవర్ష ప్రణాళికలు తయారుచేసుకునే బాధ్యతను ఒక్కో పంచాయతీపై పెడుతున్నారు. దీనికి అనుగుణంగా కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో అనేక అంశాలను జోడించ డంతో పాటు నియమ, నిబంధనలు పొందుపరిచారు. ప్రజలకు సేవలు అందించడం, విధుల నిర్వహణలో అధికారులు, ప్రజా ప్రతినిధుల జవాబు దారీతనం, పారదర్శకతతో వ్యవహరించేలా మార్పులు చేశారు. సర్పంచ్‌లకు ప్రాధాన్యత గల అంశాల్లో శిక్షణ ఇచ్చాక గ్రామాల అభివృద్ధి కార్యాచరణను అమల్లోకి తేనున్నారు.

ప్రణాళికాబద్ధ అభివృద్ధి...
గ్రామస్థాయిల్లో ప్రణాళికాబద్ధ అభివృద్ధి సాధనే ప్రభుత్వ ఉద్దేశం. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుమెంబర్లు, పంచాయతీ కార్యదర్శుల వరకు తమకు అప్పగించిన విధులు, బాధ్యతల సక్రమ నిర్వహణ ద్వారానే మార్పునకు నాంది పలకొచ్చునని భావిస్తోంది. గ్రామాల పరిసరాలు, ప్రభు త్వ సంస్థలు, కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించడం వంటి కార్యక్రమాల ద్వారా పారిశుధ్యం నిర్వహణ, పచ్చదనం పెంపునకు ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు, ఏటా కనీసం 40 వేల మొక్కలునాటి, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం. వీధిదీపాల నిర్వహణ, శ్మశాన వాటికల నిర్మాణం, అన్ని రకాల పన్నులు పూర్తిస్థాయిలో వసూలు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తయారుచేసే దిశలో పంచాయతీ కోసం ప్రణాళికను రూపొందించుకునేలా చేయడం. పంచాయతీ పరిధిలో పనిచేసే ప్రతీ ఉద్యోగి సదరు పంచాయతీ అధీనంలోనే పనిచేసేలా ఏర్పాటు. ప్రతీ రెండునెలలకు ఒకసారి గ్రామసభను జరిపి గతంలో చేపట్టిన, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనుల సమీక్ష. బడ్జెట్‌ సంబంధిత ఏర్పాట్లు, వెచ్చించే వ్యయ ప్రణాళిక, తదితరాలకు అంశాల వారీగా నిధుల కేటాయిం పు వంటి వాటిపై చర్యలు తీసుకుంటారు. 

ఆదర్శ గ్రామానికి ఆరు సూత్రాలు...
ఆదర్శ గ్రామంగా పరిగణించేందుకు ఆరు ముఖ్యమైన అంశాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి
- గ్రామంలో పరిశుభ్రమైన పరిసరాలతో పాటు, పచ్చదనం వెల్లివిరియాలి
ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామమై ఉండాలి
చెత్త, ఇతర వ్యర్థ పదా ర్ధాల నుంచి కంపోస్ట్‌ తయారీ కోసం డంపింగ్‌ యార్డ్‌ కలిగి ఉండాలి
సక్రమమైన పద్ధతుల్లో కూరగాయల మార్కెట్‌ నిర్వహణ
తగిన వసతులు, సౌకర్యాలతో శ్మశానాల ఏర్పాటు
తప్పనిసరిగా క్రీడా మైదానం కలిగి ఉండాలి 

మరిన్ని వార్తలు