ఆదర్శంగా తెలంగాణ జైళ్ల శాఖ

15 Mar, 2018 11:55 IST|Sakshi
ఆయుర్వేద చికిత్సాలయాన్ని ప్రారంభిస్తున్న జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్‌   

హైదరాబాద్‌: తెలంగాణ జైళ్లశాఖ  అనేక సంస్కరణలు అమలు చేస్తూ  దేశంలోనే  ఆదర్శంగా నిలిచిందని జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్‌ అన్నారు. బుధవారం చర్లపల్లి వ్యవసాయక్షేత్రం (ఓపెన్‌ఎయిర్‌జైల్‌) ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద చికిత్సాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు   అందుబాటులోకి తీసుకురావడంతో పాటు,  ఖైదీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చికిత్సాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

ఇతర రాష్ట్రాలకు ధీటుగా అదేస్థాయిలో  మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా కేరళ నుంచి నిపుణులను రప్పించి ఖైదీలకు శిక్షణ ఇప్పిస్తామన్నారు.  ఈ ఆయుర్వేద సెంటర్‌కు వస్తున్న ఆదరణతో చర్లపల్లిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.శాఖ ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగాయిలాంటి కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఏడాదిలో రూ: 3 కోట్ల ఆదాయ లక్ష్యంతో పాటుగా మూడు వేల మంది ఖైదీలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు.

 ఖైదీల క్షమాభిక్ష ఫైల్‌ను మూడు నెలల క్రితమే ప్రభుత్వానికి అందజేశామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు ఖైదీల క్షమాభిక్ష అమలవుతుందన్నారు. కార్యక్రమంలో జైళ్లశాఖ డీఐజీజీ ఆకుల నర్సింహ్మ, చర్లపల్లి జైళ్ల పర్యవేక్షణాధికారులు రాజేశ్, యంఆర్‌ భాస్కర్, సిఐఎ అధ్యక్షుడు కట్టంగూర్‌ హరీష్‌రెడ్డి, ఐలా సెక్రటరీ రోషిరెడ్డి, విశ్వేశ్వరరావు, ఉప పర్యవేక్షణాధికారి చింతల దశరథం, సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు