8 నిమిషాలు.. 80 వేల కణాలు

21 Jul, 2019 02:06 IST|Sakshi
శనివారం సీసీఎంబీలో అత్యాధునిక జన్యు క్రమ నమోదు యంత్రాన్ని ఆవిష్కరించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్‌. చిత్రంలో సంస్థ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తదితరులు

జన్యువ్యాధుల గుర్తింపు ఇక ఈజీ 

కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ వెల్లడి

సీసీఎంబీలో జన్యుక్రమ నమోదు యంత్రాన్ని ఆవిష్కరించిన కేంద్రమంత్రి  

ఐఐసీటీలో పలు కార్యక్రమాలకు హాజరు

సాక్షి, హైదరాబాద్‌: అత్యంత చౌకగా ఇకనుంచి అరుదైన జన్యువ్యాధులను అతివేగంగా గుర్తించవచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన, వైద్య శాఖల మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ సీసీఎంబీలో రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక జన్యుక్రమ నమోదు యంత్రాన్ని కేంద్రమంత్రి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జన్యువైవిధ్యత అధికంగా ఉన్న మనదేశంలో అరుదైన జన్యువ్యాధుల గుర్తింపును వేగవంతం చేసేందుకు జన్యుక్రమ నమోదు యంత్రం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. మరో మూడేళ్లలో సరికొత్త భారతాన్ని నిర్మించాలన్న ప్రధాని నరేంద్రమోదీ స్వప్నాన్ని సాకారం చేసేందుకు శాస్త్రవేత్తలందరూ తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.  ఆ తరువాత సంస్థ ఆవరణలోనే నిర్మించే ఆడిటోరియానికి శంకుస్థాపన కూడా చేశారు. మూడోతరం ఎరువులు, క్రిమి, కీటకనాశినుల తయారీ కోసం ఐఐసీటీ ఏర్పాటు చేసిన కొత్త విభాగాన్ని గురించి ఆయన వివరిస్తూ.. ఎరువులు, క్రిమి, కీటకనాశినులను వీలైనంత తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐసీటీ విభాగం ఉపయోగపడుతుందన్నారు.  

సభలో మెడికల్‌ కమిషన్‌ బిల్లు 
కేంద్ర కేబినెట్‌ గత బుధవారం ఆమోదించిన జాతీయ మెడికల్‌ కమిషన్‌ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండి యా స్థానంలో ఏర్పాటు కానున్న కమిషన్‌ దేశంలో వైద్య విద్య, నీట్, నెక్స్‌ట్‌ పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. ప్రైవేట్‌ వైద్య కళాశాల ల్లో 50% కన్వీనర్‌ కోటా ఫీజుల నియంత్రణ బాధ్యతలను కూడా కమిషనే చేపట్టనుంది. ఎంసీఐని ఇప్పటికే బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ తన ఆధీనంలోకి తీసుకుందని, కమిషన్‌ అందుబాటులోకి వస్తే వైద్య విద్యలో మార్పులు వస్తాయని మంత్రి చెప్పారు.

చౌకగా వ్యాధుల నిర్ధారణ: డాక్టర్‌ తంగరాజ్‌ 
ఇల్యూమినా కంపెనీ తయారు చేసిన జన్యుక్రమ నమోదు యంత్రం సేవలను సామాన్యులూ ఉపయోగించుకోవచ్చని సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌ తెలిపారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ..జన్యుక్రమ నమోదుకు రూ.లక్ష వరకూ ఖర్చు కావొచ్చని..నిర్దిష్ట వ్యాధుల నిర్ధారణకు మాత్రం ఇంతకంటే తక్కువ ఖర్చు అవుతుందన్నారు. దేశ  జనాభాలో మూడొంతుల మందికి మాత్రమే జన్యు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, జన్యుక్రమ విశ్లేషణ ద్వారా ఈ వ్యాధులకు కారణాలు గుర్తిస్తే భవిష్యత్తులో ఆయా వ్యాధుల నిర్ధారణ కొన్ని రూ.వందలతోనే పూర్తవుతుందన్నారు.

వేగంగా గుర్తించవచ్చు: రాకేశ్‌ మిశ్రా 
సీసీఎంబీలో శనివారం ఏర్పాటైన జన్యుక్రమ నమోదు యంత్రం కేవలం 8 నిమిషాల్లోనే 80 వేల కణాల్లోని జన్యుక్రమాలను, బార్‌కోడింగ్‌ పద్ధతిలో వేర్వేరుగా గుర్తించగలదని సంస్థ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ఈ పరికరాన్ని వైద్యులు, ఆస్పత్రులు, పరిశోధన సంస్థలు కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. వ్యాధులు వాటి చికిత్సలకు సంబంధించిన పరిశోధనలు మొత్తం ప్రస్తుతం కాకేసియన్‌ జాతి జనాభా ఆధారంగా జరుగుతున్నాయని..భారతీయుల అవసరాలకు తగ్గ జన్యు సమాచారం సేకరించేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు