చెరువులకు పూర్వ వైభవం తీసుకురండి

18 Oct, 2018 04:41 IST|Sakshi

అధికారులకు హైకోర్టు ఆదేశాలు

వ్యర్థాలను తెచ్చే మార్గాలు ధ్వంసం చేయండి

కఠిన చర్యలకు వెనుకాడొద్దు

పూర్తిస్థాయి నివేదిక ఇవ్వండి

సీవరేజీ బోర్డు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పీసీబీలకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: జంట నగరాల్లో మురికి కూపాలుగా మారిన చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వీలుగా కఠినంగా వ్యవహరించాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందులో భాగంగా చెరువుల్లోకి వ్యర్థాలను వదిలే మార్గాలను గుర్తించి, వాటిని ధ్వంసం చేయాలని హైదరాబాద్‌ సీవరేజీ బోర్డు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ప్రజలకు సైతం హెచ్చరికలు జారీ చేయాలంది. అవసరమైతే కఠిన చర్యలకు సైతం వెనుకాడొద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో అవసరాన్ని బట్టి తాము తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. లోటస్‌ పాండ్, ఖాజాగూడ పెద్ద చెరువు, నాచారం పెద్ద చెరువు, మీర్‌ ఆలం చెరువు, కూకట్‌పల్లి రంగథాముని చెరువుల నుంచే ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సీవరేజీ బోర్డు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణ, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని ఐపీఎస్‌ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అం శంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్‌లు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగాఇప్పటికే పలుమార్లు విచారించింది.

ఏమైనా చేయండి..
చెరువుల్లోకి మురికి నీటిని వదలకూడదని ప్రజలకు తెలియజేయాలని, పరిస్థితిని బట్టి హెచ్చరికలు కూడా చేయాలని ధర్మాసనం పేర్కొంది. చెరువుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థాలు చేరడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడం వల్లే చెరువులకు ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాల్సిందేనని, ఇందుకు ఏం కావాలంటే అది చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. చెరువుల్లోకి వ్యర్థాలను తీసుకొచ్చే మార్గాలను ధ్వంసం చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని జీహెచ్‌ఎంసీ న్యాయవాదిని ప్రశ్నించింది. 4 వారాలు పడుతుందని జీహెచ్‌ఎంసీ న్యాయవాది చెప్పగా, అంత గడువు ఎందుకని ప్రశ్నించింది. ఎన్నికల విధుల్లో అధికారులు బిజీగా ఉన్నారని చెప్పగా, ఈ సమాధానం తమకు అవసరం లేదంది. ఏది అడిగినా కూడా ఎన్నికలని చెప్పడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది.

పూర్తిస్థాయి నివేదిక ఇవ్వండి...
మొత్తం వ్యవహారంపై తమకు నివేదిక ఇవ్వాలని, వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఏయే మార్గాల ద్వారా వస్తున్నాయి. వీటి ధ్వం సానికి ఎన్నిరోజుల సమయం పడుతుంది తదితర వివరాలను అందులో పొందుపరచాలని సీవరేజీ బోర్డు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ తదితరులను ఆదేశించింది. ఈ సమయంలో హెచ్‌ ఎండీఏ తరఫు న్యాయవాది రామారావు జోక్యం చేసుకుంటూ, తాము చర్యలు తీసుకుంటే, వా టిపై కొందరు హైకోర్టును ఆశ్రయించి, సింగిల్‌ జడ్జి వద్ద స్టే పొందుతున్నారని ధర్మాసనం దృష్టి కి తీసుకొచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఒకవేళ అలాంటి ఉత్తర్వులు ఏవైనా వస్తే వాటిని తమ దృష్టికి తీసుకురావాలంది. ఇదే ధర్మాసనం చెరువుల శుద్ధీకరణకు జియో ట్యూబ్‌ టెక్నాలజీ అత్యుత్తమమైనదని, ఇందుకు చాలా తక్కువ వ్య యం అవుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విషయం పై ఓ నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీలకు ధర్మాసనం స్పష్టం చేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా