సమస్యా.. 181కు ఫోన్‌ కొట్టండి!

20 Aug, 2017 04:03 IST|Sakshi
సమస్యా.. 181కు ఫోన్‌ కొట్టండి!
మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ప్రారంభించిన మంత్రి తుమ్మల
- 24 గంటలూ అందుబాటులో  హెల్ప్‌లైన్‌కు విస్తృత ప్రచారం 
కల్పించాలని అధికారులకు సూచన 
 
సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో మహిళ ఒంటరి కాదు.. వారికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎలాంటి సమస్య వచ్చినా... ఏదైనా సలహా కావాలన్నా వెంటనే 181 నంబర్‌కు ఫోన్‌ కొట్టండి. వెంటనే స్పందించి పరిష్కార మార్గం చూపుతాం’ అని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉమెన్‌ హెల్ప్‌లైన్‌–181 నంబర్‌ను శనివారం ఆయన సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ.. వేధింపులు, దాడులకు గురైన మహిళలు ఇక కన్నీరు పెట్టుకోవద్దని, హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేస్తే తదుపరి చర్యలు రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని హామీ ఇచ్చారు.  
 
ఏడాది పొడవునా..  
ఈ హెల్ప్‌లైన్‌ ఏడాది పొడుగునా రాత్రింబవళ్లూ పనిచేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. సమస్యలకు పరిష్కారంతో పాటు సంక్షేమ కార్యక్రమాల వివరాలను సైతం ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ హెల్ప్‌లైన్‌ నంబర్‌పై విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు తుమ్మల సూచించారు. అన్ని కార్యాలయాలు, పబ్లిక్‌ స్థలాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసి చైతన్యపర్చాలన్నారు. హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసిన మహిళలకు సఖీ కేంద్రాలు, అంబులెన్స్, ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్ల ద్వారా సేవలందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆపదలో ఉన్నవారికి తాత్కాలిక వసతి కూడా కల్పిస్తామన్నారు.

రాష్ట్రంలో మహిళలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేలా సీఎం ప్రత్యేక శ్రద్ధతో పలు చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య భారీగా పెరిగిందని, అదేవిధంగా ఓపీ కూడా పెరిగిందని వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్లు, కేసీఆర్‌ కిట్లులాంటి పథకాలను అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వా నిదేనన్నారు. గృహహింస, పనిచేసే చోట వేధిం పులు, లైంగిక వేధింపులు, వరకట్నపు వేధిం పులు, ఆడపిల్లల అమ్మకం, రవాణాను నిరోధించడమే లక్ష్యంగా హెల్ప్‌లైన్‌ పనిచేస్తుందన్నారు. అనంతరం మహిళా కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి మాట్లాడుతూ మహిళల రక్షణ కు ఏర్పాటు చేసిన షీటీమ్స్‌ అద్భుత ఫలితాలు ఇస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్‌ విజయేందిర తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు