బీ కేటగిరీ సీట్లు మిగిలితే మరో కౌన్సెలింగ్

24 Sep, 2016 03:19 IST|Sakshi
బీ కేటగిరీ సీట్లు మిగిలితే మరో కౌన్సెలింగ్

- మెడికల్ కాలేజీలు ఎన్నారై కోటాకు మార్చుకోవడానికి వీల్లేదు
- హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్తర్వుల జారీకి సర్కారు ఏర్పాట్లు
- 28 లేదా 29న రెండో కౌన్సెలింగ్
- ప్రైవేటు బీ కేటగిరీ కౌన్సెలింగ్  తొలిరోజు స్పందన తక్కువే

 
 సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లు మిగిలిపోతే వాటికి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ మేరకు ఏర్పాట్లు చేయనుంది. ఇప్పటివరకు ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కౌన్సెలింగ్‌లో బీ కేటగిరీ సీట్లు మిగిలి పోయినా రెండో కౌన్సెలింగ్ నిర్వహించడం లేదు. వాటిని ఎన్నారై (సీ కేటగిరీ) కోటా కిందకు మార్చేసుకుని.. ఇష్టారాజ్యంగా అమ్మేసుకుంటున్నాయి. అయితే అలా కేటగిరీ మార్చుకోవడం కుదరదన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో దీనికి చెక్ పడనుంది. శుక్రవారం నుంచి మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శనివారం నాటికి కౌన్సెలింగ్ ముగియనుంది. ఇందులో సీట్లు మిగిలితే వాటిని ఎన్నారై కోటాలోకి మార్చకుండా.. రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 28 లేదా 29న ఈ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుందని పేర్కొంటున్నారు.

 మొదటి రోజు స్పందన అంతంతే!
 రాష్ట్రంలో 14 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 713 బీ కేటగిరీ సీట్లున్నాయి. వీటి భర్తీకి శుక్రవారం ఉస్మానియా వర్సిటీలో కౌన్సెలింగ్ ప్రారంభమైంది. నీట్ ర్యాంకుల మెరిట్ జాబితా ఆధారంగా తొలి రోజున మొదటి 1,060 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో కేవలం 384 ఎంబీబీఎస్ సీట్లు, 7 బీడీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే మొదటి రోజు స్పందన తక్కువగా ఉందని కాళోజీ ఆరోగ్య వర్సిటీ అధికారులు చెబుతున్నారు. మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో కొందరు ఏపీలో జరిగిన బీ కేటగిరీ కౌన్సెలింగ్‌లో పాల్గొని అక్కడి కాలేజీల్లో చేరడం, నీట్  ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరడంతో.. తొలిరోజు స్పందన తక్కువగా ఉందంటున్నారు. శని వారం మరో 3 వేల మందికి కౌన్సెలింగ్ జరగనున్నందున మిగతా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లన్నీ భర్తీ కావచ్చని చెబుతున్నారు. కాగా ఈ కౌన్సెలింగ్‌లో సీటు పొందినవారు ఈ నెల 27 నాటికి కాలేజీలో చేరాల్సి ఉంటుంది. అదే రోజున ఏడాది ఫీజుకు సంబంధించి గ్యారంటీ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
 
 ఎన్నారై సీట్లకు కాలేజీల వారీగా భర్తీ

 ఎన్నారై సీట్ల భర్తీకి సంబంధించి కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికే వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిసింది. బీ కేటగిరీ సీట్ల భర్తీ పూర్తికాగానే వాటికి ఏదో ఒక రోజు కాలేజీ వారీగా కౌన్సెలింగ్ నిర్వహించుకుంటాయి. ఎన్నారై కోటా సీట్లను కూడా నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తున్నట్లు చెబుతున్నా.. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏమాత్రం లేదు, కాలేజీలే ఇష్టారాజ్యంగా భర్తీ చేసుకుంటాయి. మైనారిటీ కాలేజీలు బీ కేటగిరీ సీట్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీచేశాయి.
 
 గడువుపై 26న సుప్రీం తీర్పు
 మెడికల్ అడ్మిషన్ల గడువును నెల పాటు పెంచాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఈ నెల 26న తీర్పు ఇచ్చే అవకాశం ఉం దని కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు