గెలిపిస్తే అభివృద్ధి చేస్తాం 

3 Apr, 2019 11:39 IST|Sakshi
కరన్‌కోట్‌లో మాట్లాడుతున్న రంజిత్‌రెడ్డి, చిత్రంలో మహేందర్‌రెడ్డి

జిల్లాను చార్మినార్‌ జోన్‌లో  కలుపుతాం  

సాగునీటిని తెచ్చి రైతుల  కాళ్లు కడుగుతాం   

సాక్షి, తాండూరు : చేవెళ్ల ఎంపీగా తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు. కరన్‌కోట్‌ గ్రామంలో మంగళవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. అనంతరం బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. ఎత్తిపోతల పథకం కింద కృష్ణ జలాల నీళ్లు తీసుకొచ్చి వికారాబాద్, రంగారెడ్డి రైతుల కాళ్లు కడుగుతామని తెలిపారు.

వికారాబాద్‌ ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాను చార్మినార్‌జోన్‌లో కలుపుతానని హామీ ఇచ్చారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా బలహీనపడ్డాయని చెప్పారు. ఈ తరుణంలో 16 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతారని స్పష్టంచేశారు. కేసీఆర్‌ హయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో ఘనతలు సాధించి అభివృద్ధిలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి తాండూరులో కాలుష్య నియంత్రణకు కృషి చేస్తానని తెలిపారు.   

మూడు లక్షల మోజార్టీ ఇస్తాం.. 
పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి మూడు లక్షల మోజార్టీతో గెలుస్తారని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. రంజిత్‌రెడ్డితో కలిసి కరన్‌కోట్‌లో రోడ్‌షో నిర్వహించారు. రంజిత్‌రెడ్డి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అని తెలిపారు. ఆయనను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

చేవెళ్ల లోక్‌సభ స్థానంపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ గట్టు రాంచంద్రరావు, జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వడ్డె శ్రీను, వైస్‌ ఎంపీపీ శేఖర్, కరన్‌కోట్‌ సర్పంచ్‌ వీణ, నాయకులు శంకుతల, రాంలింగారెడ్డి, హేమంత్‌ తదితరులు ఉన్నారు. 
          

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు