లింక్‌ రైలు మిస్సయితే డబ్బులు వాపస్‌

24 Feb, 2019 05:43 IST|Sakshi

ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి..

సాక్షి, హైదరాబాద్‌: వందల కిలోమీటర్ల ప్రయాణం చేసేటప్పుడు కనీసం రెండు రైళ్లయినా మారాల్సి వస్తుంది. ఆ సమయంలో ఒక రైలు ప్రయాణం ముగిసే సమయానికి మరో రైలు వెళ్లిపోవచ్చు. దీంతో రెండో రైలు కోసం బుక్‌ చేసుకున్న రిజర్వేషన్‌ చార్జీలు నష్టపోయే అవకాశం ఉంది. ఇక మీదట అలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రయాణికుల రెండు టిక్కెట్‌ల పీఎన్‌ఆర్‌ (పాసింజర్‌ నేమ్‌ రికార్డ్‌) నంబర్లను అనుసంధానం చేస్తారు. దీంతో కనెక్టింగ్‌ రైలు మిస్సయితే రెండో ప్రయాణానికి సంబంధించిన రిజర్వేషన్‌ చార్జీలను రైల్వే శాఖ తిరిగి చెల్లించనుంది. ఈ సదుపాయం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

దూరప్రాంత ప్రయాణికులు తాము అనుకున్న కనెక్టింగ్‌ రైలును అందుకోలేకపోతే అప్పటి వరకు పూర్తిచేసిన ప్రయాణ చార్జీని మినహాయించి.. రెండో రైలులో రద్దయిన ప్రయాణానికి సంబంధించిన చార్జీలను ఎలాంటి మినహాయింపులు లేకుండా పూర్తిగా తిరిగి ఇస్తారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నా, రిజర్వేషన్‌ కేంద్రాల్లో బుక్‌ చేసుకున్నా ఈ సదుపాయం కల్పిస్తారు. అయితే టికెట్‌లపై రీఫండ్‌ కోరే ప్రయాణికులు తాము వచ్చిన రైలు నుంచి స్టేషన్‌లో దిగిన మూడు గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లే వారు కనెక్టింగ్‌ రైళ్లకు ముందే రిజర్వేషన్‌ చేసుకుంటారు. కానీ మొదటి రైలు ఆలస్యంగా నడవడం వల్ల రెండో రైలు మిస్సయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో టికెట్‌ల లింకింగ్‌ సదుపాయం ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. 

మరిన్ని వార్తలు