‘హరీశ్‌తో మాటల్లేవ్‌.. అయినా మాట్లాడాను’

9 Oct, 2019 09:41 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: నియోజకవర్గ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన ఇంటికే వచ్చి విన్నవించుకునేలా ఏర్పాట్లు చేశానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం దసరా వేడుకలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ నుంచి సంగారెడ్డిలోని తన ఇంటి వద్ద ప్రజా దర్బార్‌ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 14 ఏళ్లుగా తనకు సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి హరీష్ రావుకు మాటలు లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం మాట్లాడాల్సి వచ్చిందన్నారు. నియోజకవర్గంలో ఐఐటీ తీసుకొచ్చానని, తాను పార్టీలకు తల వంచనని, ప్రజలకే తల వంచుతానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సంగారెడ్డి ప్రజల నీటి సమస్యను తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అలా చేస్తే బతికినన్ని రోజులు కేసీఆర్‌కు రుణపడి ఉంటానని అన్నారు. 

తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి ఫోటోలకు  మొక్కితే లాభం లేదనీ, వారు బ్రతికుండగానే సేవ చేయాలని హితవు పలికారు. తన తల్లి ఎంతో కష్టపడి తనను జీవితంలో ఇంతవాణ్ని చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగా లేని కారణంగా తన సతీమణి నిర్మల బాగోగులు చూసుకుంటుందని తెలిపారు. తనకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవనీ, కోట్లాది రూపాయల అప్పు ఉందనీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు