దాడులు చేస్తే బుద్ధిచెబుతాం

2 Jul, 2018 08:09 IST|Sakshi
 ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి చిత్తరంజన్‌ దాస్‌ 

సద్దుమణగని బార్‌ వివాదం

మాజీ మంత్రి చిత్తరంజన్‌ దాస్‌

కల్వకుర్తిలోని పాలమూరు చౌరస్తాలో బీసీ సంఘాల ధర్నా

స్థానిక ప్రజాప్రతినిధి తీరుపై ఆగ్రహం

దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన

కల్వకుర్తి టౌన్‌ :  అగ్రకుల నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల నాయకులపై దాడి చేస్తే బుద్ధి చెబుతామని మాజీ మంత్రి చిత్తరంజన్‌ దాస్‌ అన్నారు. వారుచేసే వ్యాపారంలో తగినంత ఓర్పు, సహనం ఉంటేనే చేయాలని, లేదంటే మానుకోవాలని చెప్పారు. బీసీ సంఘాలు, కులసంఘాల, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆదివారం కల్వకుర్తిలోని పాలమూరు చౌరస్తాలో దాదాపు మూడు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తరంజన్‌దాస్‌ మాట్లాడారు. దాడి చేయడమే కాకుండా, తమకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేయటం దారుణమని అన్నారు. అమరావతి బార్‌ యజమానులు మండలంలోని తిమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను వెంబండించి కొట్టడం దారు ణమని బీసీ సంఘాల నాయకులు అన్నారు. వెల్దండ మండలం వైస్‌ ఎంపీపీ వెంకటయ్య గౌడ్‌ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. దెబ్బలుతిన్న వారిని ప రామర్శించకపోవడం దారుణమని పేర్కొన్నారు.  


రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పూనుకుంటాం  
అమరావతి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు సమయంలో అదే ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని, అయినా వినకుండా ఏర్పాటు చేశారని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఓ ప్రముఖ ఛానల్‌ రిపోర్టర్‌ భాగస్వామిగా ఉంటూ, తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు. కల్వకుర్తి ఘటనను రాష్ట్రవ్యాప్త ఆందోళనగా మార్చుతామని బీసీ నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటన విషయంలో డీఎస్పీ చొరవ అభినందించదగినదని అన్నారు. కానీ డీఎస్పీని స్థానిక ప్రజాప్రతినిధి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఆయన దురహంకారానికి నిదర్శనమని అన్నారు.  


డీఎస్పీతో సమావేశం  
పోలీసుల సూచనలతో ధర్నా విరమించిన బీసీ సంఘాల నాయకులతో కల్వకుర్తి డీఎస్పీ ఎల్‌సీ నాయక్, నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ లక్ష్మీనారాయణ సమావేశం నిర్వహించారు. పట్టణాన్ని ప్రశాంత వాతావరణంలో ఉంచుదామని, దానికి అందరూ సహకరించాలని కోరారు. ముగ్గురు యువకులపై 20మందికి పైగా దాడిచేశారని, వారందరినీ అరెస్టు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. డీఎస్పీలు మాట్లాడుతూ వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు.  ధర్నా కార్యక్రమంలో బీసీ సబ్‌ప్లాన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లె గోపాల్, బీఎల్‌ఎఫ్‌ పార్లమెంట్‌ సమన్వయకర్త ప్రొఫెసర్‌ వెంకటదాసు, ఓబీసీ నేత పైళ్ల ఆశయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బాలాజీ సింగ్, బీసీ నాయకులు బాలస్వామి గౌడ్, జంగయ్య, కేవీపీఎస్‌ నాయకులు, వడ్డెర కుల సంఘ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు