జిల్లాలో మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా..

10 Mar, 2019 11:42 IST|Sakshi
బెల్లం పానకాన్ని ధ్వంసం చేస్తున్న ఎక్సైజ్‌ పోలీసులు (ఫైల్‌)

సాక్షి, కోదాడరూరల్‌ : ఇటీవల పలు చోట్ల మళ్లీ సారా తయారీ చేస్తున్నారు. గుట్టచప్పుడు కాకుండా ఏపీ నుంచి బెల్లం దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సారా తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా తయారయ్యే నాటుసారా వ్యాపారం పూర్తిగా  బంద్‌ అయింది. అనుమానితులను ప్రభుత్వం, ఎక్సైజ్, సివిల్‌ పోలీసులు  సారా తయారీ, విక్రయాలు జరపొద్దని స్టేషన్‌లకు పిలిచి హెచ్చరించారు.

కొందరిని బైండోవర్‌ చేసి పూచీకత్తుపై  వదిలేశారు. అయినా వినని వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. దీంతో భయడిన తయారీదారులు, బెల్లం వ్యాపారులు తమ వ్యాపారులను బంద్‌ చేశారు. పూర్తిగా దీనిపై ఆధారపడిన కుటుంబాలకు ఆసరాగా ప్రభుత్వం నుంచి ఉచితంగా రుణాలు కూడా అందజేశారు. దాంతో ఎక్కడా నాటుసారా వాసన లేకపోవడంతో పోలీసులు కూడా ఇటీవల పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే అదునుగా భావించి గతంలో ఈ వ్యాపారం రుచి చూసిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా సారాను తయారు చేస్తున్నారు. కోదాడ శివారు గ్రామాలు, తండాలు, హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని కృష్ణపట్టె ప్రాంతాల్లో మళ్లీ ఎక్కువగా సారా తయారవుతుందని సమాచారం.

గ్యాస్‌ పొయ్యిలపైనే తయారీ...
అయితే గతంలో ఈ సారాను కట్టెల పొయ్యిపై కట్టెలు, టైర్లు వంటివి వేసి మంటతో తయారు చేసే వారు. ఇవి వాడితే విపరీతమైన  పొగ వచ్చి ఎక్కడ సారా వండినా గుర్తు పట్టేవారు.   దాంతో ఇప్పుడు తయారీ దారులు ఇంట్లోనే గ్యాస్‌ పొయ్యిపై బట్టీలను పెట్టి సారా తయారు చేస్తున్నారు. గ్యాస్‌ ఖర్చు ఎక్కువైనా సారా రేటు కూడా అధికంగా ఉండటంతో తండాలు, గ్రామాల్లో  ఇదే విధంగా తయారు చేస్తున్నట్లు తెలిసింది. 

శివారు గ్రామాలు, తండాల్లో ఎక్కువగా....
ఎక్కువగా మారుమూల ఉన్న గ్రామాలు, తండాల్లో ఈ సారా తయారీ ఇటీవల ఎక్కువైంది. గతంలో సారా, నల్లబెల్లం వ్యాపారం చేసిన వారు ఇటీవల రంగంలోకి దిగినట్లు సమాచారం. మఠంపల్లి, గరిడేపల్లికి చెందిన బెల్లం వ్యాపారులు గతంలో సారా తయారు చేసే వారి ఫోన్‌ నంబర్‌లు తీసుకుని నల్లబెల్లం కావాలా అని ఫోన్‌ చేసి వారిని ఏపీ వారికి పరిచయం చేయడంతో వారే నేరుగా వచ్చి బెల్లాన్ని అమ్ముతున్నట్లు సమాచారం. గ్రామాలు, తండాల్లోని కొద్ది మందిని ఎంచుకుని వారికి రాత్రి సమయాల్లో నల్లబెల్లం సరఫరా చేస్తున్నారు. 

ఖరీదైన వాహనాల్లో రవాణా...
ఇదివరకు బెల్లం, పటికను వ్యాపారులు ఆటోలు, టాటాఎస్‌ వాహనాల్లో తీసుకొచ్చి సారా తయారీ దారులకు దిగుమతి చేసేవారు. రాత్రి సమయాల్లో ఈ వ్యాపారం ఎక్కువగా  కొనసాగడంతో పోలీసులు తనిఖీలు చేసే సమయంలో పట్టుబడుతున్నారు. దీంతో ఎవరికీ అనుమానం కలగకుండా   ఖరీదైన కార్లలో రవాణా చేస్తున్నారు. నల్లబెలం రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఇదివరకు 50 కేజీల నల్లబెల్లం బస్తా రూ.1400 నుంచి 1600 ఉండగా ప్రస్తుతం రూ.3500, పటికను కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు.

ఏపీ నుంచి భారీగా నల్ల బెల్లం 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాష్ట్రంలోకి  భారీగా నల్లబెల్లం, పటిక సరఫరా అవుతుంది. ఇటీవల కోదాడ, హుజూర్‌నగర్‌లో పెద్ద ఎత్తున పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. ఏపీలోని గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, విజయవాడ నుంచి రాష్ట్రం లోకి అక్రమంగా బెల్లాన్ని దళారులు రవాణా చేస్తున్నారు. మఠంపల్లి మండలం, చింతలపాలెం మండలాల్లో ఉన్న బల్లకట్టు నుంచి, కోదాడ మండల రామాపురం క్రాస్‌రోడ్డు నుంచి మాత్రమే ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే మార్గం ఉంది. అంటే దాదాపుగా  ఈ మార్గాల గుండానే బెల్లం రవాణా అవుతుందని తెలుస్తుంది. రామాపురం క్రాస్‌రోడ్‌లో ఎక్సైజ్‌ చెక్‌పోస్టు పెట్టినా సిబ్బందిని నియమించకపోవడంతో  ఫలితం లేకుండా పోయింది. ఇక బల్లకట్టులు, మట్టపల్లి బ్రిడ్జి వద్ద కూడా చెక్‌పోస్ట్‌లు లేకపోవడంతో రవాణా సాగుతుంది.

నిఘా తగ్గడంతో పెరిగిన తయారీ
సారా తయారీపై ఎక్సైజ్, సివిల్‌  పోలీసులు నిఘా పెట్టకపోవడంతో ఇటీవల తండాలు, పలు గ్రామాల్లో సారా తయారీ ఎక్కువైనట్లు తెలిస్తుంది. కోదాడ మండలం భీక్యాతండాలో చూస్తే  తాగుడు అలవాటు ఉన్న కొందరు, వ్యాపారం చేసే మరికొందరు సారా బట్టీలను పెడుతున్నారు. వీరు రాత్రి సమయంలో బట్టీలు పెడుతున్నారు. కొద్ది మంది వారు తాగడానికి తయారు చేసుకుని మిగిలినది విక్రయిస్తున్నారు. మరికొందరు మాత్రం ద్విచక్రవాహన డిక్కీలు, ట్యాంక్‌ కవర్లలో పెట్టుకుని కోదాడ, హుజూర్‌నగర్‌లో విక్రయిస్తున్నారు. సీసా (650ఎంఎల్‌) సారాను రూ.150 విక్రయిస్తున్నారు. ఒక్క బీక్యాతండాలోనే కాకుండా పలు తండాలు, గ్రామాల్లో కూడా తయారు చేస్తున్నట్లు తెలిస్తుంది.

సమాచారం ఇస్తే దాడులు చేస్తున్నాం...
గ్రామాలు, తండాల్లో సారా తయారు చేస్తున్నట్లు సమాచారం వస్తే దాడులు చేస్తాం. వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచా రం లేకపోయినప్పటికీ రొటీ న్‌గా దాడులు నిర్వహిస్తూనే ఉన్నాము. ఇటీవల కోదాడ, చిలుకూరు మండలాల్లోని పలు గ్రామాల్లో దాడులు నిర్వహించి సారా తయారు చేసే వారిపై  కేసులు నమోదు చేశాం.    
– ఆర్‌.సురేందర్, ఎక్సైజ్‌ సీఐ, కోదాడ

మరిన్ని వార్తలు