ఎన్‌ఓసీ కావాలా..? రూ.2 కోట్లు ఇవ్వాలి!

25 Nov, 2017 02:51 IST|Sakshi
సర్పంచ్‌ భర్త బల్ల చంద్రశేఖర్‌ 

     వార్డు మెంబర్లకు ఓపెన్‌ ప్లాట్లు 

     గ్రామాభివృద్ధికి రూ.కోటి.. సర్పంచ్‌కూ రూ.కోటి  

     రాయగిరి సర్పంచ్‌ భర్తపై రియల్టర్‌ ఫిర్యాదు 

సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి సర్పంచ్‌ భర్త బల్ల చంద్రశేఖర్‌ ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌ కోసం రూ.2 కోట్లు డిమాండ్‌ చేశాడు. తనకు అడిగినంతా డబ్బు ఇవ్వకపోతే ఎన్‌ఓసీ రాదని, ఇక్కడ ప్లాట్లు విక్రయించలేవని బెదిరింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వకపోతే ప్లాట్ల విక్రయాన్ని అడ్డుకుంటానని హెచ్చరించాడు. తనను అధికార పార్టీ సర్పంచ్‌ భర్త డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడని ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా, టుమారో వరల్డ్‌ వెంచర్‌ యజమాని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన భువనగిరి రూరల్‌ పోలీస్‌లు చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు. రాయగిరి శివారులో రెండేళ్ల క్రితం 300 ఎకరాల్లో ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా, టుమారో వరల్డ్‌ పేరుతో వెంచర్‌ చేసి ఓపెన్‌ ప్లాట్లు విక్రయిస్తున్నారు. రాయగిరి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 758, 759, 761, 763, 765, 766, 767, 768, 769, 770, 771, 772, 773,774, 775, 776, 795, 796, 797, 799, 800, 801లో ఈ వెంచర్‌ అభివృద్ధి చేశారు.

వెంచర్‌కు హెచ్‌ఎండీఏలో అనుమతులు పొందడానికి గ్రామపంచాయతీ నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఓసీ) అవసరం ఉంది. ఇందుకోసం వెంచర్‌ యజమాని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే.. ఎన్‌ఓసీ ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలంటూ సర్పంచ్‌ భర్త.. వెంచర్‌ యజమాని విజయ్‌కుమార్‌తో బేరం పెట్టాడు. 3 మూడు ఆప్షన్లను ఇచ్చాడు. వెంచర్‌కు అనుమతి ఇవ్వాలంటే తనకు రూ.ఒక కోటి, గ్రామ పంచాయతీ అభివృద్ధికి రూ.ఒక కోటితోపాటు 11 మంది వార్డు సభ్యులకు వెంచర్‌లో 11 ఓపెన్‌ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్‌ పెట్టాడు. అయితే తాను అంత ఇచ్చుకోలేనని తగ్గించాలని విజయ్‌ కోరాడు. ఈనెల 19న చంద్రశేఖర్‌తోపాటు, మరికొందరు వార్డు సభ్యులు వెంచర్‌ వద్దకు వెళ్లి అక్రమంగా వెంచర్‌ చేస్తున్నావని గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో గొడవ దృశ్యాలు నమోదయ్యాయి. వెంచర్‌ యాజమాని విజయ్‌కుమార్‌తో చంద్రశేఖర్‌ నడిపిన బేరసారాలు ఫోన్‌లో రికార్డు చేశారు. వీటన్నింటికి సంబంధించిన ఆధారాలతో విజయ్‌కుమార్‌ ఈనెల 22న కలెక్టర్‌తోపాటు, డీసీపీ, ఇతర అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై సర్పంచ్‌ భర్త చంద్రశేఖర్‌ను వివరణ కోసం ప్రయత్నించగా ఆయన సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌లో ఉంది.  

చంద్రశేఖర్‌పై కేసు నమోదు 
వెంచర్‌కు అనుమతి కోసం డబ్బులు డిమాండ్‌ చేసిన భువనగిరి మండలం రాయగిరి సర్పంచ్‌ భర్త బల్ల చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. వెంచర్‌ అనుమతికి ఇవ్వాల్సిన ఎన్‌ఓసీ కోసం గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోగా అనుమతి ఇవ్వకుండా డబ్బులు అడిగాడని వెంచర్‌ యజమాని విజయకుమార్‌ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆదివారం వెంచర్‌ వద్దకు వెళ్లి చంద్రశేఖర్, మరికొంత మంది వెంచర్‌ కార్యాలయంలోని కుర్చీలను పగులగొట్టి దౌర్జన్యానికి దిగారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు