వైఎస్ ఉంటే రజకులకు న్యాయం జరిగేది

7 Dec, 2014 23:19 IST|Sakshi

మెదక్ రూరల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉంటే రజకులకు సముచిత న్యాయం జరిగేదని, ఆయన అకాల మృతితో రజకులకు తీరని లోటు జరిగిందని రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతరాజు రమణ పేర్కొన్నారు. మెదక్ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఆదివారం రజక ఉద్యోగుల ఐక్యవేదిక జిల్లా సమావేశం నిర్వహించారు.  సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రమణ మాట్లాడుతూ సమాజంలో నేటికీ వెట్టి చేస్తున్నది ఒక్క రజక కులస్తులేనన్నారు.

ఇతర కులవృత్తుల వారు తాము చేసిన పనికి డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటుంటే  గ్రామీణ ప్రాంతంలోని రజకులు రోజంతా కష్టపడి దుస్తులు ఉతికి రాత్రి పూట వెళ్లి ఇల్లిల్లూ తిరిగి అడుక్కునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  రజకుల కష్టాలను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. ఆయన అకాల మృతితో రజకులను పట్టించుకునే వారే లేరన్నారు.  రజకులకు న్యాయం జరగాలంటే  ఎస్టీ, లేదా ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

రజక ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు దుర్గయ్య మాట్లాడుతూ దేశంలోని 19 రాష్ట్రాల్లో రజకులు ఎస్టీ, ఎస్సీ జాబితాల్లో  ఉన్నారని, మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని  డిమాండ్ చేశారు. రజకుల సమాజసేవను గుర్తించి వారికి గీతవృత్తిదారులకు ఇస్తున్న మాదిరిగానే పింఛన్ ఇవ్వాలన్నారు. రజక ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింలు మాట్లాడుతూ  ప్రతి మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన క్యాదర్శి పెంటయ్య, కార్యదర్శి రాజేష్,  నాయకులు ప్రభాకర్, శ్రీకాంత్, యాదగిరి, విద్యార్థి విభాగం నాయకులు విజయ్, మల్లేశం, కుమార్‌లతో పాటు జిల్లా నాయకుడు బ్యాతోల్ సిద్ద రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు