మహిళా రక్షణ ‘ఏకతాటి’పైకి

17 Mar, 2018 04:10 IST|Sakshi

     త్వరలో ఒకే యూనిట్‌గా షీ టీమ్స్, భరోసా, ప్రొటెక్షన్‌ సెల్‌

     కసరత్తు చేస్తున్న పోలీసుశాఖ

     కేసుల నమోదు, విచారణ బాధ్యత ప్రత్యేక యూనిట్‌కే

     విభాగం చీఫ్‌గా ఐజీ స్వాతి లక్రా!  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పోలీసుశాఖ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం వేర్వేరు విభాగాలు పనిచేస్తున్న షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌లను కలిపి ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటుకు ఉండాల్సిన అధికారం, తదితర వ్యవహారాలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. షీ టీమ్స్‌ నమోదు చేసే కేసులు, భరోసా కేంద్రాల్లో ఇచ్చే కౌన్సెలింగ్, పునరావాస కార్యక్రమాలు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు తదితరాలన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రత్యేక భవనం ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాల్లో నమోదయ్యే అత్యాచార, హత్య కేసులను సైతం దర్యాప్తు చేసేందుకు ఈ యూనిట్‌కే అధికారాలు కల్పించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

అదేవిధంగా మైనర్లపై లైంగిక వేధింపులు, ఆన్‌లైన్‌లో వేధింపులు, వరకట్న కేసులను పర్యవేక్షిస్తున్న సీఐడీ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ బా«ధ్యతలను కూడా ఈ విభాగమే చూసేలా మార్పులు చేయనున్నారు. ఒక్కో విభాగంలో ఒక్కో యూనిట్‌ ఉండేకన్నా మొత్తం మహిళల రక్షణ, భద్రతకు సంబంధించి ఒకే యూనిట్‌ ఉంటే బాగుంటుందని పోలీసుశాఖ భావిస్తోంది. 

ఐజీ స్వాతి లక్రా నేతృత్వంలోనే... 
హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన షీ టీమ్స్, భరోసా కేంద్రాలు సత్ఫలితాలివ్వడంతో వాటిని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడాన్ని వేగవంతం చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఇవన్నీ ప్రారంభించగా నగర అదనపు కమిషనర్‌గా పని చేసిన స్వాతి లక్రా ఇటు షీ టీమ్స్, అటు భరోసా కేంద్రాలను లీడ్‌ చేస్తూ వచ్చారు. స్వాతి లక్రా ఇటీవలే శాంతిభద్రతల ఐజీగా బదిలీ అయినా ఆమెకే ఉమెన్‌ సేఫ్టీ, భరోసా కేంద్రాల బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం ఏర్పాటు చేయాలని భావిస్తున్న స్పెషల్‌ యూనిట్‌కు ఐజీ స్వాతి లక్రానే చీఫ్‌గా ఉంటారని పోలీసు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, త్వరలో చేపట్టబోయే కార్యక్రమాలను సైతం ఆమె విజయ వంతం చేయగలరన్న నమ్మకంతో పోలీసుశాఖ ఉంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా