హైస్కూల్‌ విద్యార్థులకు హైటెక్‌ శిక్షణ

14 Feb, 2019 10:52 IST|Sakshi

ఐఐఐటీ– హైదరాబాద్‌ వినూత్న ప్రయోగం

మే నెలలో శిక్షణ ప్రారంభం ఏడు నుంచి పదోతరగతి

చదువుతున్న విద్యార్థులకు ఉపయుక్తం

సాక్షి, సిటీబ్యూరో: హైస్కూల్‌ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు హైటెక్‌ శిక్షణనిచ్చేందుకు నగరంలోని ఐఐఐటీ–హెచ్‌ సంస్థ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కాంపిటీషన్‌ యుగంలో విద్యార్థులకు వర్తమాన జీవితంలో ఉపయుక్తంగా ఉండే సాంకేతిక అంశాలతోపాటు..వారిలో తార్కిక ఆలోచనా విధానం, విశ్లేషణా సామర్థ్యం పెంపు, నైపుణ్య శిక్షణ, సమస్యల పరిష్కారం, కంప్యూటర్స్‌లోని ప్రాథమిక, ఆధునిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే దిశగా స్టూడెంట్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం(ఎస్‌టీఈపీ) ద్వారా అత్యాధునిక శిక్షణ ఇవ్వనుంది. ఈ ఏడాది మే నెల 6 నుంచి 31 వరకు గచ్చిబౌలిలో ఈ శిక్షణ నిర్వహించనున్నట్లు  నిర్వాహకులు తెలిపారు. ఐఐఐటీ అధ్యాపకులతోపాటు ఆయా రంగాలకు చెందిన నిపుణులు చిన్నారులకు ఆయా అంశాలపై శిక్షణనివ్వనుండడం విశేషం. 

ఒలింపియాడ్‌లోపథకాల సాధనకు మార్గం...
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైన్స్, మ్యాథ్స్‌ తదితర సబ్జెక్టులపై నిర్వహించేఒలంపియాడ్స్‌లో నగరానికి చెందిన విద్యార్థినీ విద్యార్థులు పథకాలు, మెడల్స్‌ సాధించేలా వారికి తర్ఫీదునిచ్చేందుకే ఈ శిక్షణా
కార్యక్రమాన్ని ఐఐఐటీ రూపొందించడం విశేషం. ఈ శిక్షణకు సంబంధించిన బోధనా అంశాలను కోడ్‌.ఓఆర్‌జీ సంస్థ రూపొందించింది. ఇందులో ప్రధానంగా గణితం, కంప్యూటర్స్‌కు సంబంధించిన ఆధునిక అంశాలు, విద్యార్థుల్లో సునిశిత పరిశీలన దృష్టిని పెంచేలా నైపుణ్య శిక్షణ, తార్కిక ఆలోచనా విధానం పెంచే విధానాలు, విశ్లేషణాత్మక సామర్థ్యం పెంపు, విభిన్న రకాల సమస్యల సాధనపై తరగతిలో బోధనతోపాటు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ఇందులో 7,8 తరగతుల విద్యార్థులకు కంప్యుటేషనల్‌ థింకింగ్‌ అండ్‌అప్లికేషన్స్‌(సీటీఏ), తొమ్మిది, పదోతరగతులు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకుకంప్యూటేషన్‌ థింకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంశాలపై శిక్షణనిస్తారు.

నమోదుకు ఏప్రిల్‌ 14 చివరి తేదీ...
ఈ కోర్సులో శిక్షణ పొందాలనుకున్న విద్యార్థినీ విద్యార్థులు మరిన్ని వివరాలకు https://www.iiit.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా నమోదుచేసుకున్నవారికి శిక్షణపొందేందుకు అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 

మరిన్ని వార్తలు