వనపర్తిలో ట్రిపుల్‌ ఐటీ! 

10 Apr, 2018 02:44 IST|Sakshi

స్థలాలను పరిశీలించిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి  

సాక్షి, వనపర్తి : రాష్ట్రంలో మరో ట్రిపుల్‌ ఐటీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కళాశాలను వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టి.పాపిరెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాపిరెడ్డి నేతృత్వంలోని బృందం సభ్యులు సోమవారం వనపర్తికి వచ్చారు. వనపర్తిలో ప్రభుత్వ భవనాలు, స్థలాలు, విద్యుత్, నీటివసతి, రహదారులు, ఇదివరకే ఇక్కడ ఉన్న విద్యాలయాల వివరాలను ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వారికి వెల్లడించారు.

తాత్కాలికంగా ట్రిపుల్‌ ఐటీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ భవనాన్ని చూపించారు. అలాగే శాశ్వత భవనాల నిర్మాణాలకు కావాల్సిన ప్రభుత్వ స్థలాలు ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ భవనాల పక్కనే ఉన్నాయని తెలిపారు. ఈ వివరాలపై పరిశీలనకు వచ్చిన అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం పాపిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే వనపర్తిలోని వసతులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు