రాష్ట్రానికి కేంద్ర విద్యా సంస్థలు కలేనా?

6 Jul, 2018 01:13 IST|Sakshi

ముందున్నది ఎన్నికల సమయం.. ఇప్పట్లో అమలుకు నోచుకోకపోతే కష్టమే

కేంద్రం వద్ద ఐఐఎం, ట్రైబల్‌ యూనివర్సిటీ, ఏవియేషన్‌ యూనివర్సిటీ ఫైలు

సూత్రప్రాయంగా అంగీకరించినా ఆచరణకు నోచుకోలేదు

కేంద్రాన్ని ఒప్పించేందుకు చర్యలు వేగవంతం చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), ఏవియేషన్‌ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పట్లో రాష్ట్రానికి రాకపోతే కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఒకట్రెండు నెలల్లో వాటి ఏర్పాటుకు స్పష్టమైన ఉత్తర్వులతోపాటు నిధులు మంజూ రు కాకపోతే మరో మూడేళ్ల వరకు అవి వచ్చే అవకా శమే లేదు. ముందస్తు ఎన్నికల సూచనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటిపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశం లేనట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, కేంద్రం నుంచి రావాల్సిన ఆమోదాలు, నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణపై దృష్టి సారించింది. రాష్ట్ర ఎంపీల సహకారంతో వచ్చే పార్లమెంటు సమావేశాల్లోగా వాటిని సాధించాలని ఆలోచన చేస్తున్నా.. ఎంత మేరకు ఆచరణ సాధ్యం అవుతుందన్నది వేచి చూడాల్సిందే.

విభజన చట్టంలోనే హామీ ఇచ్చినా..
ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ, ఏవియేషన్‌ యూనివర్సిటీ, కరీంనగర్‌లో మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌ ఉర్దూ యూనివర్సిటీ క్యాంపస్‌ కోసం రాష్ట్ర ఎంపీలతోపాటు ముఖ్యంగా ఐటీ మంత్రి కె.తారకరామారావు, ఎంపీ వినోద్‌కుమార్‌ పలుమార్లు ప్రత్యేకంగా కేంద్ర మంత్రులు, అధికారులతో చర్చించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అంశం అయితే రాష్ట్ర విభజన చట్టంలోనే పొందుపరిచారు. అయినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు.

నాలుగేళ్లలో స్థల పరిశీలన, నిధుల కేటాయింపు, తనిఖీలతోనే సరిపోయింది. వరంగల్‌ జిల్లా ములుగులో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి సరిపోదని, నిబంధనల ప్రకారం లేదంటూ కేంద్రం కొర్రీ వేసినట్లు తెలిసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కేంద్రం మెలిక కారణంగా ప్రారంభానికి నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు వరంగల్‌ ప్రాంతంలోనే ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగానే స్పందించినా ఒక్క అడుగు కూడా ముందు కు పడలేదు.

మరోవైపు ఏవియేషన్‌ యూనివర్సిటీ, కరీంనగర్‌లో ఉర్దూ యూనివర్సిటీ పరిస్థితి అలాగే ఉండిపోయింది. ఈ ఐదారు నెలల్లో కనుక వాటిని సాధించుకోకపోతే వచ్చే మూడేళ్ల దాకా అవి వచ్చే అవకాశమే ఉండదని, తరువాత ఏ ప్రభుత్వం వస్తుం దో.. వచ్చినా అదెలా స్పందిస్తుందో తెలియని స్థితి ఉంటుందని అధికారులు భావిస్తు న్నారు. అందుకే వచ్చే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో వాటి కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు