రోజుకు 2 సెషన్లలో ‘గేట్‌’ 

27 Dec, 2018 02:10 IST|Sakshi

గేట్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఐఐటీ మద్రాస్‌

ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూట్‌ టెస్టు ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌) పూర్తిస్థాయి షెడ్యూలు జారీ అయింది. దేశంలోని ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లో 2019–20 విద్యా సంవత్సరంలో ఎంటెక్‌లో ప్రవేశాలకు గత ఆగస్టులోనే నోటిఫికేషన్‌ జారీ చేసిన ఐఐటీ మద్రాసు పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూలును బుధవారం జారీ చేసింది. ఈ ప్రవేశ పరీక్షను ఐఐఎస్సీ బెంగళూరు, ఏడు ఐఐటీల నేతృత్వంలో నిర్వహించే బాధ్యతను ఐఐటీ మద్రాస్‌కు అప్పగించాయి. గత సెప్టెంబర్‌లోనే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఐఐటీ మద్రాస్‌ స్వీకరించారు.

2019 ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో గేట్‌ను నిర్వహిస్తామని వెల్లడించింది. రోజూ 2 సెషన్లుగా 4  రోజుల పాటు 24 సబ్జెక్టుల్లో గేట్‌ నిర్వహించనుంది. 2019లో స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టులోనూ ప్రవేశాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. పరీక్షల కోసం తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, వరంగల్‌ పట్టణాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు ఉంటాయి. విద్యార్థులను పరీక్ష హాల్లోకి 40 నిమిషాల ముందునుంచే అనుమతిస్తారు. ఉదయం సెషన్‌లో 10 గంటల తర్వాత, మధ్యాహ్నం సెషన్‌ వారిని 3 గంటల తర్వాత అనుమతించరు. నెగటివ్‌ మార్కుల విధానం ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి పావు మార్కు కట్‌ చేస్తారు. పరీక్ష ఫలితాలు 2019 మార్చి 16న విడుదల అవుతాయి. 

పెరిగిన ప్రాధాన్యం.. 
ఎంఈ/ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు తాము చేపట్టే నియామకాల్లో గేట్‌ స్కోర్‌కు ప్రాధాన్యం ఇస్తుండటంతో తెలంగాణ నుంచి గేట్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. బీహెచ్‌ఈఎల్, గెయిల్, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, ఐవోసీఎల్, ఎన్టీపీసీ, ఎన్‌పీసీఐఎల్, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలు గేట్‌ స్కోర్‌ ఆధారంగా నియామకాలు చేపడుతున్నాయి. అలాగే కేంద్రం గ్రూప్‌–ఏ కేటగిరీలోని సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌; సీనియర్‌ రీసెర్చ్‌ ఆఫీ సర్‌ వంటి పోస్టులను కూడా గేట్‌ స్కోర్‌ ఆధారంగా భర్తీ చేస్తోంది. అయితే గేట్‌ నిర్వహణ సంస్థకు, ఉద్యోగ నియామకాలకు సంబంధం లేదని, అది అభ్యర్థులే చూసుకోవాలని ఐఐటీ మద్రాసు స్పష్టం చేసింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్‌ కోర్సు ల్లో పరిశోధన విద్యార్థులు ఆర్థి«క సాయం పొందేందుకు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి ఇచ్చే స్కాలర్‌షిప్‌లు పొందేందుకు  గేట్‌లో అర్హత సాధించాలి. ఈ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. గేట్‌ స్కోర్‌ను ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి మూడేళ్ల పాటు పరిగణనలోకి తీసుకుంటారు.  

మరిన్ని వార్తలు