అటార్నీ జనరల్‌ వ్యాఖ్యలను ఖండించిన ఐజేయూ 

9 Mar, 2019 02:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికారిక రహస్యాల చట్టం కింద ‘ద హిందూ’పత్రికపై చర్యలు తీసుకుంటామంటూ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వ్యాఖ్యానించడాన్ని ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. రఫేల్‌ ఒప్పందంలోని దొంగలించిన డాక్యుమెంట్ల ఆధారంగా కథనాలు రాశారని ఆరోపిస్తూ ఈ హెచ్చరికలు చేయడం సరికాదని ఐజేయూ అధ్యక్షుడు, భారత ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యుడు దేవులపల్లి అమర్, సెక్రటరీ జనరల్‌ సబీనా ఇంద్రజిత్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులోనే వేణుగోపాల్‌ వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి ప్రభుత్వంలోని అవకతవకలను బయటపెట్టకుండా మీడియాకు, వర్కింగ్‌ జర్నలిస్టులకు పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్‌ ముందే అటార్నీ జనరల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. అటార్నీ జనరల్‌ తన ప్రకటనను వెనక్కు తీసుకుని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను గౌరవించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా తమ వార్త కథనాలకు ఆధారాలను బయటపెట్టమని ఒత్తిడి చేయరాదని హిందూ పత్రిక అధినేత ఎన్‌.రామ్‌ చేసిన ప్రకటనకు వారు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.   

మరిన్ని వార్తలు