‘అంతా’ చెట్ల వెనకాలే..!

19 Nov, 2018 11:46 IST|Sakshi
బొక్కలకుంట కట్టపై ఏపుగా పెరిగిన కంపచెట్లు  

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా బొక్కలకుంట కట్ట

జోరుగా వ్యభిచారం, జూదం

ఏపుగా పెరిగిన కంపచెట్లు

పోలీసు వాహనం వస్తే పరారు

సాక్షి, కల్వకుర్తి రూరల్‌: నేరాలు, అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులు నిరంతరం నిఘా పెట్టడటంతో పాటు నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. సమాజంలో పెరిగిపోయిన నేర ప్రవృత్తి, అశ్లీలత వెరసి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దోహదం చేస్తుంది.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన బొక్కలకుంట కట్ట పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ నుంచి హైదరాబాద్‌ చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో ఉంది. రహదారి రద్దీగా ఉంటుంది. కట్టపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పక్కన ఖాళీ వ్యవసాయ పొలంలో పెద్ద ఎత్తున కంపచెట్లు పెరిగిపోయాయి.

రోడ్డు పక్కన చూస్తే కంపచెట్లే కనిపిస్తాయి. ఆ కంప చెట్ల వెనకాల చట్టవ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు వెళ్లిన సంఘటనలున్నాయి. పోలీస్‌ వాహనం వచ్చేలోగా అక్కడ ఉన్నవారు పరారవుతుంటారు.

యువతే ఎక్కువ
కంపచెట్ల వెనకాల జోరుగా జూదం ఆడుతున్నారు. మొత్తం 30ఏళ్లలోపు లోపు యువత ఈ జూదానికి సంబంధించిన పేకాట, చిత్తుబొత్తులకు  బానిసలవుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతుంది. చీకటి పడితే చాలు జూదంతో పాటు ఆ చెట్ల మధ్య వ్యభిచారం జోరుగా సాగుతోంది.

ఇందులోనూ ఒక వర్గానికి చెందిన యువకులు ఎక్కువగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొద్ది మంది వ్యభిచారినులు ఆ చుట్టు పక్కల సంచరిస్తూ విటులను ముఖ్యంగా యువతను పెడదోవ పట్టించడంతో పాటు ఆ ప్రాంతంలోని వారికి సమస్యలు సృష్టిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం
కుంట కట్టపై కంప చెట్ల వెనకాల జరుగుతున్న అసాంఘిక కార్యక్రలాపాలపై నిఘా పెంచుతాం. సమాచారం అందిస్తే దాడులు చేసి అడ్డుకుంటాం. చర్యలు తీసుకుంటాం. నర్సింహులు,ఎస్‌ఐ, కల్వకుర్తి

మరిన్ని వార్తలు