జీర్ణం.. జీర్ణం.. దేవాదాయం!

12 Feb, 2018 03:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నగరంలో ఆలయాల అధీనంలోని దుకాణాల అద్దెలు స్వాహా

సొమ్మంతా ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకే..

ప్రతినెలా రూ.అరకోటి వరకు పక్కదారి పడుతున్న వైనం

చక్రం తిప్పుతున్న ఓ బడా నేత

నేతలతో కుమ్మక్కైన అధికారులు

మెమోలిచ్చి చేతులు దులుపుకుంటున్న దేవాదాయ శాఖ

సాక్షి, హైదరాబాద్‌:
అవి దేవాలయానికి చెందిన దుకాణాలు..
ఈ విషయం దేవాదాయ శాఖ రికార్డులే చెబుతున్నాయి. ఆ దుకాణాల నుంచి అద్దె రూపంలో వచ్చే ప్రతి పైసా దేవుడి ఖజానాకే చెందాలి. ఇది దేవాదాయ శాఖ చట్టం చెబుతున్నమాట!
కానీ దాదాపు రూ. అరకోటి వరకు అద్దె సొమ్ము ఎంచక్కా ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి చేరిపోతోంది. ఇలా ఒకటీ రెండు నెలలుగా కాదు.. ఏళ్లుగా సాగుతోంది!

మరి అధికారులేం చేస్తున్నారు?
దేవుడి ఖాతాలో జమ కావాల్సిన అద్దెలను ఎందుకు వసూలు చేయటం లేదంటూ ఉన్నతాధి కారులు సంబంధిత అధికారికి మెమో జారీ చేస్తారు. కానీ చర్యలు తీసుకోరు. కొన్ని నెలల తర్వాత మళ్లీ ఓ మెమో ఇస్తారు. అదీ బుట్టదాఖలవుతుంది. ఇదేం పద్ధతి అంటారా.. అదంతే.. ఎందుకంటే అది దేవాదాయశాఖ కాబట్టి!

అక్రమాలకు ఇదిగో మచ్చుతునక..
సికింద్రాబాద్‌లోని రాణిగంజ్‌లో శంకరమఠం ఉంది. దానికి అనుబంధంగా దేవాలయం ఉంది. ఇది 1950లలో దేవాదాయశాఖ సికింద్రాబాద్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ అయింది. రోడ్డువైపు ఉన్న స్థలంలో చాలాకాలం క్రితమే ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. ఇందులో దాదాపు 55కి పైగా దుకాణాలున్నాయి. ఇది కీలక వాణిజ్య ప్రాంతం కావటంతో వాటికి డిమాండ్‌ ఎక్కువ. ఇక్కడ సాధారణ దుకాణాలకు కూడా నెలవారీ అద్దె కనీసం రూ.20 వేల వరకు ఉంటుంది. ఈ లెక్కన ప్రతినెలా వీటి అద్దె రూ.10 లక్షలకుపైగానే దేవాలయ ఖాతాలో పడాలి. కానీ ఇప్పటి వరకు దేవుడి ఖజానాకు అద్దె రూపంలో నయా పైసా రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే ఓ బడా నేత కనుసన్నల్లో ఈ ప్రాంతం ఉంది. దీంతో దేవాదాయశాఖ అధికారులు దానిపై చర్యలు తీసుకోవటానికి సాహసించ లేదు. రెండేళ్ల క్రితం ఓ అధికారి ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి విషయాన్ని కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ దేవాలయానికి ఓ కార్యనిర్వహణాధికారిని నియమించాలని నివేదించారు. దీంతో ఏడాదిన్నర క్రితం ఓ అధికారిని ఈఓగా నియమించారు. అద్దెలు వసూలు చేయటమే ప్రధాన పనిగా పురమాయించారు. కానీ ఏడాదిన్నర గడిచినా ఒక్క పైసా దేవుడి ఖాతాలో పడలేదు. కానీ ప్రతినెలా ఠంచన్‌గా అద్దెలు మాత్రం లక్షల్లో వసూలవుతూ.. ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి చేరుతున్నాయి. ప్రతి రెండుమూడు నెలలకోమారు ఈఓ తీరును తప్పుపడుతూ మెమోలు పంపటానికే పరిమితమైన దేవాదాయశాఖ అంతకుమించి చర్యలు తీసుకోలేకపోయింది. బడా నేత కనుసన్నల్లో బాజాప్తా జరుగుతున్న కుంభకోణమిది. ప్రతినెలా రూ.లక్షల్లో వచ్చి పడుతున్న అద్దెలను స్వాహా చేసేందుకు నేతలు, అధికారులు, మఠం నిర్వాహకులు కుమ్మక్కై ఈ తతంగా నడుపుతున్నారు.

వైష్ణవాలయం వద్దా ఇదే కథ..
సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌ ప్రాంతంలో ఉన్న అతిపురాతన వైష్ణవాలయం వద్దా ఇదే కథ నడుస్తోంది. ఇక్కడ గజం జాగా దొరికినా దుకాణం పెట్టేస్తారు. అలాంటిది ఆ దేవాలయానికి ఇక్కడ 50 వరకు దుకాణాలున్నాయి. వాటి అద్దె ప్రతినెలా రూ.15 లక్షల వరకు ఉంటుంది. కానీ అద్దెల సొమ్ము దేవాలయానికిగాక ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్లోంది.

20 ఏళ్ల కిందటి ధరలతో..
దేవాదాయశాఖ పరిధిలో ఉన్న గ్రెయిన్‌ బజార్‌ ధర్మశాలకు కూడా పెద్ద సంఖ్యలో దుకాణాలున్నాయి. అయితే వీటి విషయంలో అధికారులు అతి తెలివి ప్రదర్శించారు. మిగతావాటిలా వీటిని గాలికొదిలేయలేదు. ప్రతినెలా అద్దె వసూలు చేస్తున్నారు. కానీ అవి రెండు దశాబ్దాల క్రితం నాటి ధరలు. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం వాటిని సవరించాల్సి ఉన్నా అధికారులు హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. వాటిని సవరించకుండా ఉన్నతాధికారులు ఎప్పట్లాగే మెమోలు పంపి చేతులు దులుపుకొంటున్నారు. వ్యాపారులు మాత్రం మార్కెట్‌ ధరల మేరకు అద్దె చెల్లిస్తున్నా దేవుడి ఖజానాకు అతి తక్కువ జమ అవుతోంది. ఇలా దుకాణాలను బంగారుబాతుల్లాగా మార్చుకున్న నేతలు.. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని దేవుడి సొమ్మును దిగమింగుతున్నారు. ప్రతినెలా రూ.అరకోటి వరకు పక్కదారి పడుతున్నట్టు అధికారులే అంచనా వేస్తున్నారు. ప్రతినెలా రూ.లక్షల్లో ఆదాయం ఉంటున్నా ఒక్కోసారి ఉత్సవాలకు చాలినంత సొమ్ము లేక తూతూమంత్రంగా కానిచ్చేస్తుండటం దేవాదాయశాఖ దుస్థితికి నిదర్శనం.

అక్రమాలకు ఉదాహరణలెన్నో..
సికింద్రాబాద్‌ పాన్‌బజార్‌ వేణుగోపాలస్వామి ఆలయం అధీనంలోని దుకాణాలకు చాలాకాలంగా అద్దె వసూలు కావడం లేదు. దీంతో ఆ దుకాణదారులను ఖాళీ చేయించి కొత్తవారికి అద్దెకిచ్చే ఉద్దేశంతో కోర్టులో ఎవిక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దాన్ని ఉపసంహరించుకొని ప్రస్తుత దుకాణదారులనే కొనసాగించాలంటూ ఓ బడా నేత చక్రం తిప్పుతున్నాడు.
అమీర్‌పేటలోని హనుమాన్‌ దేవాలయం అధీనంలోని దుకాణాలను ఓ నేత దర్జాగా సబ్‌లీజుకు ఇచ్చేసి పెద్దమొత్తంలో అద్దెలు స్వాహా చేస్తున్నాడు. ఇది స్థానిక అధికారులకు తెలిసినా కళ్లుమూసుకున్నారు.

మరిన్ని వార్తలు