పిన్నితో వివాహేతర సంబంధం..!

18 Aug, 2019 12:32 IST|Sakshi
కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఐ సురేష్‌యాదవ్‌ 

అడ్డుగా ఉన్నాడని చిన్నాన్న హత్య

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం 

చివరకూ ఇద్దరూ కటకటాలపాలు 

సాక్షి, తలకొండపల్లి(కల్వకుర్తి): వరుసకు పిన్ని అయ్యే మహిళతో వివాహేతర సంబంధం నెరిపాడు. విషయం తెలుసుకున్న పెద్దలు పంచాయితీ పెట్టి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అయినా, వారు మారలేదు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చిన్నాన్న వరసయ్యే వ్యక్తిని చంపేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేసి విఫలమయ్యాడు. చివరకు ఇద్దరూ కటకటాలపాలయ్యారు. కేసు వివరాలను శనివారం స్థానిక ఠాణాలో ఎస్‌ఐ సురేష్‌యాదవ్‌ కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధి సంఘాయిపల్లికి చెందిన మీసాల మల్లేశ్‌ (26) స్థానికంగా ఉపాధి లేకపోవడంతో ఐదేళ్ల క్రితం నగరానికి వలస వెళ్లి మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో అతడికి నాగర్‌కర్నూల్‌ జిల్లా సిద్దాపూర్‌ మండలంలోని పలుగు తండాకు చెందిన సోనీతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. కొన్ని రోజుల తర్వాత వీరు కులాంతర వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, మల్లేశ్‌కు సమీప బంధువైన (వరుసకు కుమారుడు) మెదక్‌పల్లికి చెందిన మీసాల లాలయ్య అలియాస్‌ లాలూ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతను తరచూ నగరంలో ఉంటున్న మల్లేశ్‌ ఇంటికి వెళ్తుండేవారు. వరసకు చిన్నమ్మ అయినా సోనీతో ఇతడు పరిహాసమాడుతుండేవాడు. కుమారుడే కదా అని మల్లేశ్‌ పట్టించుకునేవాడు కాదు.

ఈక్రమంలో సోనీ, లాలూకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బంధువులకు తెలియడంతో మల్లేశ్‌కు చెప్పారు. దీంతో ఆయన బంధువుల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. తీరు మార్చుకోవాలని పెద్దలు సోనీ, లాలూకు సూచించినా ఫలితం కనిపించలేదు. తమ బంధానికి అడ్డుగా ఉన్న మల్లేశ్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లాలూ, సోనీ నిర్ణయించుకొని అదను కోసం వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా,  మల్లేశ్‌ పొలానికి సంబంధించి రైతుబంధు డబ్బుల కోసం ఈనెల 4న స్వగ్రామానికి వచ్చాడు.

ఈ విషయాన్ని సోనీ ఫోన్‌ చేసి లాలూకు చెప్పింది. మరుసటి రోజు లాలూ తలకొండపల్లికి వచ్చాడు. అతడు మల్లేశ్‌కు ఫోన్‌ చేసి మద్యం తాగుదామని చెప్పాడు. అనంతరం చంద్రధన గ్రామానికి రప్పించుకున్నాడు. ఇద్దరూ తలకొండపల్లికి బైకుపై వెళ్లాడు. అక్కడ మద్యం తీసుకున్న తర్వాత లాలూ మల్లేశ్‌ను వైన్స్‌ వద్దే ఉంచి ఫర్టిలైజర్‌ దుకాణానికి వెళ్లి ఎలుకలను చంపే మందును తీసుకున్నాడు. అనంతరం మల్లేశ్‌ను బైక్‌పై ఎక్కించుకొని మిడ్జిల్‌ రోడ్డులో వెళ్లాడు. మధ్యలో సంఘాయిపల్లి గ్రామస్తులు అంజనేయులు, నర్సింలు, నరేష్‌లు ఎదురవడంతో లాలూ మల్లేశ్‌ను హత్య చేయడం విరమించుకున్నాడు. అనంతరం అందరూ కలిసి మద్యం తాగి వెళ్లిపోయారు. ఈనెల 7న లాలూ తిరిగి పథకం అమలు చేద్దామని భావించాడు. మల్లేశ్‌కు ఫోన్‌ చేసి సంఘాయిపల్లి గేట్‌ వద్దకు రమ్మని చెప్పాడు.

మల్లేశ్‌ అక్కడికి వెళ్లగా బైకుపై ఎక్కించుకొని మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ వెళ్లారు. అక్కడ మద్యం తీసుకొని తాగారు. పథకం ప్రకారం లాలూ మల్లేశ్‌కు ఎక్కువగా మద్యం తాగించాడు. తర్వాత మండల పరిధిలోని దేవునిపడకల్‌ శివారులోని రిజర్వు ఫారెస్టులోకి తీసుకెళ్లి మళ్లీ మరికొంత మద్యం తాగారు. లాస్ట్‌ పెగ్‌లో లాలూ ఎలుకల మందును కలిపి మల్లేశ్‌తో తాగించారు. దీంతో అస్వస్థతకు గురై మృతిచెందాడు. అనంతరం లాలూ మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి స్వగ్రామానికి వెళ్లాడు. 11న హత్య విషయం వెలుగుచూసింది. ఎస్‌ఐ సురేష్‌యాదవ్‌ కేసు దర్యాప్తు చేశారు.

మల్లేశ్‌ హత్యకు గురయ్యాడని అనుమానం వ్యక్తం చేశాడు. సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ సురేశ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో విచారణ జరిపి హత్యగా నిర్ధారించారు. ఈమేరకు లాలూ, సోనీని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా హత్య విషయం అంగీకరించడంతో రిమాండుకు పంపారు. లాలూ (20)కు ఇంకా వివాహం కాలేదు.  హత్య కేసును చాకచక్యంగా పరిష్కరించిన సీఐ, ఎస్‌ఐకి డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఈ సందర్భంగా రివార్డు ప్రకటించారు. 

మరిన్ని వార్తలు