అన్యాయంగా  కేసులు పెట్టారు

27 Jun, 2019 12:14 IST|Sakshi
మద్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన తెలుపుతున్న సోమూర్‌ గ్రామస్తులు

ఆవేదన వ్యక్తం చేసిన సోమూర్‌ గ్రామస్తులు

పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన

ట్రాన్స్‌కో అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

సాక్షి, మద్నూర్‌ (కామారెడ్డి): సోమూర్‌కు చెందిన పలువురిపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని ఆ గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం సోమూర్‌కు చెందిన 30 మంది మహిళలు మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం ట్రాన్స్‌కో సిబ్బంది గ్రామానికి వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. విద్యుత్‌ మీటర్ల తనిఖీల పేరిట ఇళ్లలోకి విద్యుత్‌ అధికారులు చొరబడ్డారని ఆరోపించారు. రెండున్నర రోజుల పాటు గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారన్నారు. ట్రాన్స్‌కో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే గ్రామస్తులపైనే కేసులు పెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు. గ్రామానికి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినా, బుధవారం గ్రామానికి చెందిన పలువురి ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారన్నారు.

దురుసుగా ప్రవర్తించారు
బుధవారం 50 మంది ట్రాన్స్‌కో అధికారుల బృందం సోమూర్‌కు చేరుకొని ఇండ్లలో ఉన్న విద్యుత్‌ మీటర్లను ఇంటి బయట బిగిస్తామని దౌర్జన్యం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ క్రమంలో తోపులాట జరిగిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్సై వెంకట్రావ్‌కు ఫిర్యాదు చేశారు.

గ్రామాన్ని సందర్శించిన డీఎస్పీ
బాన్సువాడ డీఎస్పీ యాదగిరి బుధవారం సోమూర్‌ గ్రామాన్ని సందర్శించారు. ఐదు రోజుల క్రితం గ్రామంలో ట్రాన్స్‌కో అధికారులపై జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు