నిలోఫర్‌లో పసి కూనలపై ప్రయోగాలు?

27 Sep, 2019 01:53 IST|Sakshi

నిలోఫర్‌లో అక్రమంగా క్లినికల్‌ ట్రయల్స్‌

ఫార్మా కంపెనీల నుంచి డబ్బులు దండుకుని దుర్మార్గాలు!

తల్లిదండ్రులకు తెలియకుండానే నిర్వహిస్తున్న వైనం

విచారణకు ఆదేశించిన వైద్య విద్య డైరెక్టర్‌

సాక్షి, హైదరాబాద్‌ : పసిపిల్లలకు వైద్యం చేయాల్సిన నిలోఫర్‌ ఆస్పత్రిలో వారిపైనే క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీల నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన మందులు, వ్యాక్సిన్లను ముందుగా పిల్లలపై ప్రయోగిస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. పిల్లలపై ప్రయోగాలకు నిలోఫర్‌ ఆస్పత్రిలోని కొందరు డాక్టర్లు సహకరిస్తున్నారు. కొన్ని రకాల నిషేధిత డ్రగ్స్‌ కూడా ట్రయల్స్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఫార్మా కంపెనీల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంటూ పిల్లలపై ప్రయోగాలకు పాల్పడుతున్నారు. పిల్లలపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారన్న విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి గురువారం సాయంత్రం విచారణకు ఆదేశించారు. నిలోఫర్‌లో జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలు అందజేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు.  

పీడియాట్రిక్స్‌ ప్రొఫెసర్‌ బాగోతం.. 
పీడియాట్రిక్స్‌ విభాగంలోని ఓ ప్రొఫెసర్‌ ఫార్మా కంపెనీలతో కలసి అనధికారికంగా ట్రయల్స్‌ చేస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. స్వైన్‌ఫ్లూ, రొటా, హెచ్‌పీవీ, ఎంఆర్‌ వ్యాక్సిన్లను సదరు ప్రొఫెసర్‌ పిల్లలకు ఇస్తున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లల రక్త నమూనాలు సేకరిస్తున్నట్టు కొందరు డాక్టర్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నా సూపరింటెండెంట్‌ గుర్తించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ చేయడానికి సదరు ప్రొఫెసర్‌ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాను అన్ని అనుమతులు తీసుకునే ట్రయల్స్‌ చేస్తున్నట్లు సదరు ప్రొఫెసర్‌ చెబుతున్నారు.
 
గొడవతో విషయం బయటకు.. 
ఇటీవల ఇద్దరు డాక్టర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ వ్యవహారం బయటపడింది. ఫార్మా కంపెనీల ప్రతినిధుల సమక్షంలోనే చాలా రోజుల నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఇన్నాళ్లుగా ఈవ వ్యవహారం నడుస్తున్నా సంబంధిత అధికారులు కళ్లు మూసుకుని పట్టించుకోకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ చేసినందుకు కొందరు డాక్టర్లకు ఫార్మా కంపెనీలు లక్షలు కుమ్మరిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కింది నుంచి పైస్థాయి వరకు అనేకమంది భాగస్వామ్యం ఉన్నట్లు విమర్శలున్నాయి. ఇప్పటివరకు దాదాపు 50 మంది పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగినట్టు సమాచారం. అందులో కొందరి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలిసింది. ఈ విషయాలు బయటికి రాకుండా కొందరు డాక్టర్లు, అధికారులు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు పరిస్థితిని చక్కదిద్దినట్లు సమాచారం. 
  

క్లినికల్‌ ట్రయల్స్‌ అంటే.. 
పరిశోధనశాలల్లో అభివృద్ధిపరిచిన ఏదైనా మందులు, వ్యాక్సిన్లు మనుషులపై లేదా రోగులపై సరిగా పనిచేస్తాయా లేదా అనే విషయాలను ధ్రువీకరించుకునేందుకు చేసే పరీక్షలనే క్లినికల్‌ ట్రయల్స్‌ అంటారు.  ఒకవేళ మందు వికటిస్తే సైడ్‌ ఎఫెక్ట్‌లు, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. క్లినికల్‌ ట్రయల్స్‌ను భారత్‌లో డ్రగ్స్, కాస్మెటిక్స్‌ చట్టం, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చట్టం తదితర చట్టాల నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు అనుమతి లభించడం చాలా ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. కఠినమైన నిబంధనలతో, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టే చాలా కంపెనీలు గుట్టుగా ఈ ట్రయల్స్‌ను జరుపుతాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు