ఐటీఐలో అక్రమ వసూళ్లు..

24 Jul, 2018 14:21 IST|Sakshi
విద్యార్థుల నుంచి డబ్బుల వసూలు దృశ్యం 

ఒక్కో విద్యార్థి నుంచి రూ.1000

హాజరు శాతం లేనివారిని గుర్తించి బ్లాక్‌ మెయిల్‌

అడ్మిషన్‌ రద్దు చేస్తామని బెదిరింపు

నిజామాబాద్‌అర్బన్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అటెండెన్స్‌ పేరిట విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.1000 చొప్పున గుంజుతున్నారు. కళాశాలలోనే బహిరంగంగా ఈ తంతు సాగుతోంది.

వసూళ్ల బాగోతంలో ముఖ్యమైన అధికారులతో పాటు మరో నలుగురి ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. బాలుర ఐటీఐలో విద్యార్థులు రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కాకపోవడంతో వారిని కళాశాలకు అనుమతించడం లేదు. వరుసగా మూడు నుంచి నాలుగు రోజులు రాని విద్యార్థులను గుర్తించి వారికి ఫోన్‌లో మీ అడ్మిషన్‌ను రద్దు చేస్తున్నామని సందేశం పంపిస్తున్నారు.

అనంతరం కళాశాలకు వచ్చిన విద్యార్థులను ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి వసూళ్ల కార్యక్రమం చేపడుతున్నారు. నీ అడ్మిషన్‌ కొనసాగాలంటే హాజరు శాతం ఉండాలి, లేదంటే అడ్మిషన్‌ను కోల్పోతారు అంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. డబ్బులు ఇస్తే హాజరు వేస్తామని చెబుతున్నారు.

ఉన్నతాధికారికి సన్నిహితంగా ఉండే ఉద్యోగిని వసూళ్ల కార్యక్రమానికి కేటాయించారు. రెండు నెలలుగా వ్యవహారం సాగుతోంది. సుమారు 200 మంది వరకు ఉన్న కళాశాలలో 100 మంది విద్యార్థుల నుంచి అక్రమ వసూళ్లు చేసినట్లు తెలిసింది.

ఈ అక్రమ వసూళ్లను భరించలేకపోయిన కొందరు విద్యార్థులు ఇటీవల సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ వసూళ్ల దందాను నిరోధించాలని విద్యార్థులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు