అక్రమ కట్టడం కూల్చిందెవరు..? 

15 Sep, 2019 10:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చర్చనీయాంశమైన పిల్లర్ల కూల్చివేత

భిక్కనూరు: మండల కేంద్రంలోని జీపీ ఎదురుగా నిర్మిస్తున్న అక్రమ కట్టడం పిల్లర్లను ఎవరు కూల్చారన్న విషయం భిక్కనూరులో చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయం ప్రొక్లెయిన్‌తో ప్రజలందరు చూస్తుండగానే రెండు పిల్లర్లను కూల్చివేశారు. ఈ విషయమై గ్రామసర్పంచ్‌ తున్కి వేణు, పాలకవర్గం సభ్యులు, ఈఓ రజనీకాంత్‌రెడ్డి తమకేమీ సంబంధం లేదని సమాధానమిస్తున్నారు. దీంతో ఎవరు ఈ అక్రమ కట్టడం పిల్లర్లను కూల్చారని ప్రశ్నించుకున్నారు. జీపీ వారే పిల్లర్లను కూలగొట్టించి మిన్నకుంటున్నారని కొందరు భావిస్తున్నారు. అక్రమ కట్టడం పిల్లర్లను కూలగొట్టించి జీపీ పాలకవర్గం తమకు తెలియదనడం ఎంత వరకు సమంజసమని మరికొందరు అంటున్నారు. ప్రొక్లెయినర్‌ యజమానిని, డ్రైవర్‌ను రప్పించి ఎవరు కూలగొట్టారన్న విషయమై ఆరా తీస్తామని గ్రామపెద్దలు అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఈఓ కిషన్‌రావును కలెక్టర్‌ సత్యనారాయణ గతంలో సస్పెండ్‌ చేసి, సర్పంచ్‌ తున్కి వేణుకు షోకాజ్‌ నోటీసు ఇచ్చిన విషయం విధితమే. పాలకవర్గ సభ్యులు మొదట అనుమతిచ్చి కలెక్టర్‌ ఈ విషయంలో సీరియస్‌గా ఉండడంతో అనుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఈ విషయం మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో చర్చనీయాంశంమైంది. తిరిగి ఆదివారం పిల్లర్లు కూల్చిన విషయం తమకు తెలియదని జీపీ పాలకవర్గం అనడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ కట్టడమైతే పూర్తిగా తొలగించాల్సింది పోయి, రెండు పిల్లర్లు మాత్రం ఎందుకు తొలగించారన్న విషయంపై గుసగుసలు వినిపించాయి. 

మరిన్ని వార్తలు